ఆర్టీపీపీలో మెయిన్ గేటు వద్ద ఉద్యోగుల ధర్నా
రాయలసీమ ప్రత్యేక ప్రతినిధి, యర్రగుంట్ల:
జనవరి నెల (2024) వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఆర్టీపీపీ) ఉద్యోగులు సోమవారం మెయిన్ గేటు వద్ద ధర్నా చేపట్టారు.
ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు చెల్లించాలన్న డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం జరిగింది. ఆర్టీపీపీ అల్ యూనియన్స్ , అసోసియేషన్స్ నాయకులతో
జనవరి 30వ తేదీ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన సమావేశంలో తీసుకొన్న నిర్ణయం మేరకు.. జనవరి 31న అల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఆర్టీపీపీ చీఫ్ ఇంజనీర్ ను కలిసి.. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని విన్నవించారు. లేకుంటే ఫిబ్రవరి 5 నుంచి ఆందోళన చేస్తామని సీఈకి యూనియన్ల నాయకులు లేఖను అందజేశారు. కానీ అధికారులు, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు జనవరి వేతనాలపై ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆయా యూనియన్ల నాయకుల నేతృత్వంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆర్ టీ పీ పీ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసించారు. ఆదివారంలోపు ఉద్యోగులకు వేతనాలు ఇవ్వని పక్షంలో ఫిబ్రవరి 5వ తేదీ (సోమవారం) నుంచి ఆర్టీపీపీ పవర్ గేటు వద్ద ధర్నా ఉంటుందని హెచ్చరించారు. ఆ మేరకు ఉదయము 9 నుంచి 10 గంటల వరకు ధర్నా నిర్వహించారు.