వి.ఆర్.పురం
మండల పరిధిలోని చినమట్టపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో, మహాత్మాగాంధీ 76వ వర్థంతి కార్య క్రమంని మంగళవారం ప్రధానోపాధ్యాయులు ఎస్.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వర్థంతీ సభకు ముందు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూల మాలవేసి, ఘన నివాళ్లర్పించారు. సహోపాధ్యాయురాలు టి.విజయకుమారి అధ్యక్షతన జరిగిన సభలో ప్రధానోపాధ్యాయులు ఎస్.నాగేశ్వరరావు విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ భారతదేశ, ప్రజల నిర్దిష్ట పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసి, ఆకళింపు చేసుకున్న స్వాతంత్ర్య ఉద్యమ నేతల్లో మహాత్ముడు అగ్రగణ్యులని పేర్కొన్నారు. గాంధీజీ మత సామరస్యం కోసం అహర్నిశలు పని చేశారని తెలిపారు. దేశంలో అణగారిన బడుగు, బలహీన వర్గాలు, స్త్రీల విముక్తి కోసం గాంధీజీ పోరాటం చేశారని, నాగరికతకు, ఊరికి దూరంగా నెట్టబడిన దళితులు, బలహీన వర్గాలను, హరి జనులను జన జీవన స్రవంతిలోకి తీసుకురావడానికి సమాజం అంగీకరించేలా హరిజనోద్దరణ , సహపంక్తి భోజనాలు పెద్ద ఎత్తున జరిపేలా సంస్కరణోద్యమం నడిపిన నేత మహాత్ముడని కొనియాడారు. నేటి విద్యార్థులు మహాత్మాగాంధీ అనుసరించిన సూత్రాలను పాటించాలనీ, గాంధీజీ పాటించిన క్రమ శిక్షణను పాటించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, శానిటేష అయాలు, కమ్యూనిటీ వర్కర్లు పాల్గొన్నారు.

