మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందించేందుకు ఎయిర్‌టెల్ ఆధ్వర్యంలో 136 , జియో ఆధ్వర్యంలో 164 టవర్లు ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు.క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు (ఏఎస్‌ఆర్), పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏర్పాటు చేసిన 164 సెల్ టవర్లను సీఎం ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44, ప్రకాశంలో 4, ఏలూరులో 3, శ్రీకాకుళంలో 2, కాకినాడలో 1 టవర్ ఏర్పాటయ్యాయి.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ”ఇవాళ 300 టవర్లు, జూన్‌లో 100 టవర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 400 కోట్లు ఖర్చు చేశారు. 400 టవర్ల ఏర్పాటు ద్వారా 2.42 లక్షల మందికి ఉపయోగకరం. 5,549 గ్రామాలకు పూర్తి మొబైల్ టెలికాం సేవలు అందుతాయి. అత్యంత మారుమూల ప్రాంతాలు నెట్‌వర్క్ పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతాలకు పథకాల అమలు మరింత సులభతరం అవుతుంది. సమాచార సంబంధాలు బాగా మెరుగుపడతాయి.గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, ఇంగ్లిషు మీడియం స్కూల్స్ ఇవన్నీకూడా గ్రామ రూపురేఖలను మారుస్తాయి. ఈ ప్రాంతాల్లో టెలికాం సేవలు కారణంగా ఇవి మరింత బలోపేతంగా నడుస్తాయి” అని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ముఖ్య కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, ఐటీ సెక్రటరీ కోన శశిధర్, జియో ఆంధ్రప్రదేశ్ సీఈవో మందపల్లి మహేష్ కుమార్, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.