వి.ఆర్.పురం
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని, మండలం వద్ద భక్త జనులు రామనామ స్మరణలతో యావత్తు భారతావని మారుమోగగా, అదేవిధంగా సోమవారం మండలం వద్ద కూడా భక్త జనులు రామనామ జపం చేశారు. ఈ పుణ్య కార్యాన్ని పురస్కరించుకొని, మండలంలోని రామ భక్తులు వేకువజామున లేచి శబరి గోదావరి జీవ నదుల సంగమంలో పవిత్ర స్నానాలు చేసి మండలంలోని శ్రీరామగిరి గ్రామంలోని రామాలయం, విఆర్ పురంలోని రామాంలయం, పలు గ్రామాల్లో ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించుకున్నారు. అదేవిధంగా అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ఎవరి ఇళ్లలో వారు దేవుని మందిరంలో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న రాముని ఫోటోల వద్ద పెట్టుకొని, పూలు పండ్లతో దీపారాధనలు చేసి, అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట జరిగేవరకు రామనామ స్మరణలు చేస్తూ, టీవీలలో వచ్చే లైవ్ ని చూస్తూ భక్త జనులు పుణితులయ్యారు. అనంతరం వారు పూజ మందిరంలో ఉంచిన అక్షతలను ఇంటిల్లిపాదీ తలపై చల్లుకొని, ఈ మహత్తర కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో, పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకున్నారు. ఐదు శతాబ్దాల రామ భక్తుల కల నెరవేరిన వేళ, అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్టను , వేద పండితుల మంత్రోచ్చారణలతో, భక్త జనుల రామనామ స్మరణలతో, మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా జరిగిన ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని, టీవీలలో చూసే భాగ్యం కలిగిన, ఇప్పుడు ఉన్న భక్త జనులు తిలకించటానికి నోచుకున్న వారంతా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆనంద పర్యంత మయ్యారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని పురస్కరించుకొని మండల బీజేపీ, ఆర్ ఎస్ ఎస్, శ్రీరాముని సేవకులు వడ్డిగూడేం శివాలయం నుంచి రాముని జెండాలను చేతబూని, శ్రీరామగిరి రామ మందిరం వరకూ, దాదాపు పది కిలో మీటర్ల దూరం రామ నామ స్మరణ చేసుకుంటూ రామాలయం వద్దకు చేరుకొని, శ్రీరాముని దర్శించుకొని, పూజలు అభిషేకాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముత్యాల సత్యనారాయణ, లోల్ల సుధాకర్, ముత్యాల శ్రీరాం, కడుపు రాజు, ముత్యాల శంకర్ రావు, ముత్యాల సాయిరామ్, బొర్రా గణేష్, పెట్టా హరిబాబు, యం సుబ్బలక్ష్మి, కామేశ్వరి, అప్పనపల్లి సాయి, బొర్రా కామేశ్వరి, లోల్లా సుధాకర్, ముత్యాల రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.