(నందం రామారావు)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలైన జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల ఎన్నికల్లో కూటమికి చెందిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు అత్యధిక సీట్లు గెలుచుకుంది. బహుశా ఇంత పెద్ద ఎత్తున భారీ విజయాలు దక్కుతాయని కూటమి నాయకులు కూడా ఊహించి వుండరు. ఈ గెలుపును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తూ “ఓటర్లు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు పట్టం కట్టారని, కూటమి సర్కారుపై ఇది ప్రజల విశ్వాసం తెలుపుతున్నది” అని అన్నారు. అలాగే “రెండేళ్ల పాలనకు ప్రజలు జైకొట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ విజయం సంకేతం” అని కూడా అన్నారు. కూటమి నాయకులు ఇంతటి గొప్ప దక్కిందని సంతోషపడుతున్నా, ప్రజలు ఈ విజయాన్ని ముందే ఊహించారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో వున్నా, ఆ ప్రభుత్వానికే ప్రజలు ఓట్లు వేస్తారు. నాయకుల అవసరాలు, ప్రజలు తమ పనులకోసం ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను ఆశ్రయించడం జరుగుతూ వుంటుంది. ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేయటం కూడా మాములే! సాధారణంగా ప్రతిపక్షాలు స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపుకోసం పెద్దగా డబ్బు ఖర్చు పెట్టరు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు, ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ కూడా గెలుపు కోసం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో, మునిసిపాలిటీలలో వందల కోట్లు ఖర్చు చేశారు. ఉదాహరణగా కృష్ణా జిల్లా ప్రధాన కేంద్రమైన మచిలీపట్నంలో నగరపాలక సంస్థ మేయర్, కార్పొరేటర్ల ఎన్నికలలో కూటమి నాయకులు ఓటుకు వెయ్యి రూపాయలు చొప్పున ఎన్నికలకు ముందు రోజే ఇంటింటికీ తిరిగి పంచారు. ఇలా డబ్బు తీసుకున్న వారిలో పలువురు ధనవంతులు కూడా వుండడం విశేషం! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఓటుకు ఐదు వందల రూపాయలు చొప్పున పంచారు. తమ దగ్గర కూటమి నాయకులు ఇచ్చినంత డబ్బు లేదని చెప్పి మరీ ఐదొందలు మాత్రమే ఇచ్చారు. రెండు పార్టీల దగ్గర డబ్బు తీసుకున్న ఓటరు మాత్రం ఎక్కువ డబ్బు ఇచ్చిన కూటమికే ఓట్లు వేశారు. ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా వెయ్యి రూపాయలు చొప్పున ఓటర్లుకు ఇస్తే, అంతకంటే ఎక్కువ డబ్బే ఇవ్వడానికి కూటమి నాయకులు సిద్ధపడ్డారన్న సమాచారం ఓట్లరలో వుంది! అధికారంలో కూటమి ప్రభుత్వం వుంది. గనుక, ఆ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం ఎంతో అవసరం. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయం దక్కకపోతే, దాని ప్రభావం రాబోయే సార్వత్రిక ఎన్నికలపై పడుతుంది! అందువల్ల కూటమి నాయకులు ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారన్నట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో ఎక్కడా ‘ఓట్లు’ కొనలేదని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు చెప్పగలరా? తమ అభివృద్ధిని చూసే ఓటరు ఓట్లు వేశారని చెప్పగల నిజాయితీ వారికి వుందా? ఇక్కడ కూటమి నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఓట్లు ఖచ్చితంగా కొనుగోలు చేశారు అన్నది బహిరంగ రహస్యమే. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఈ ఎన్నికల్లో విజయం సాధించమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు! ఒక్క ఉదాహరణ జనసేన పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా వంటరిగా పోటీ చేసింది సంవత్సరంలో. ఆ ఎన్నికల్లో “ఎవరూ డబ్బు పెట్టి ఓట్లు కొనుగోలు చేయకండి. డబ్బుతో రాజకీయాలు మనకొద్దు. మన నిజమైన బలం ఎంత వుందో తెలుసుకుందాం” అని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ మాటకు కట్టుబడి జనసేనలో పోటీ చేసిన వారు ఏ ఒక్కరు కూడా ఓట్లు కొనలేదు. రాష్ట్రం మొత్తం మీద జనసేనకు చెందిన ఒక్కరే శాసన సభ్యునిగా గెలిచారు. పవన్ కళ్యాణ్‌కూడా ఓడిపోయారు!
ఇంకో ఉదాహరణ: ఎన్.టి. రామారావు తెలుగు దేశం పార్టీ స్థాపించి పోటీకి దిగినప్పుడు పోటీ చేసిన వారిలో ఎక్కువమంది కొత్తవారే! సినీ గ్లామర్‌తో తెలుగుదేశం పార్టీకి (ఉమ్మడి రాష్ట్రం) మహావస్తే 50 సీట్లకంటే ఎక్కువ రావని అన్ని రాజకీయ పార్టీలు అంచనా వేశాయి. ఆ సీట్లు కూడా ఎన్.టి.రామారావు గ్లామర్‌తోనే శాసన సభ్యులుగా గెలుస్తారని అంచనా వేశారు. చివరకు ఫలితాలు వెలువడగా అధికారంలో వున్న కాంగ్రెసుకు దిక్కులు తెలియకుండా పోయాయి. ఆ ఎన్నికల్లో ఆంధ్రా, తెలంగాణా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వందల కోట్లు గెలుపుకోసం ఖర్చు చేసింది. చివరకు ఘోరంగా ఓడిపోయింది. ప్రజాస్వామ్యంలో నిజమైన ఎన్నికలు ఎలా వుంటాయో ప్రజలు చూశారు!
అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. మంత్రులు, శాసన సభ్యులు, నాయకులపై గతంలో ఎన్నడూ రానంతగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రజలు మార్పు కావాలనుకున్నారు. ఆ మార్పు ఎన్.టి. రామారావులో చూశారు.
ఒక్క విషయం ఆ ఎన్నికల్లో వ్యాసకర్త స్వయంగా పలు ప్రాంతాలలో తిరిగి ఎన్నికల సరళిని పరిశీలించారు. “ఎవరికి ఓటు వేశారని ప్రశ్నించగా, ఇంకెవరికండీ.. ఎన్టీరామారావుకే మరి కాంగ్రెసు పార్టీ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నారుగదా.. ఆ పార్టీకి ఓటు ఎందుకు వేయలేదని ప్రశ్నించగా”.. అవతల వాళ్ల నుంచి ఒక్కటే సమాధానం మంచి పాలన కోసం ఓట్లు వేశాం. కాంగ్రెస్ నాయకులు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారని” అప్పటి నుంచి ఆంధ్రాలో కాంగ్రెసు పార్టీ కోలుకోలేదు!
ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. డబ్బు సంపాదన కోసమే అనేక మంది రాజకీయాల్లోకి వస్తున్నారు. ప్రజలకు నిజాయితీగా సేవ చేయాలన్న అభిప్రాయం ఎవరికీ లేదు! డబ్బు.. డబ్బు.. డబ్బు సంపాదనే ధ్యేయం.. లంచావతారంగా మారిపోతున్నారు. ఇది ప్రజల్లో బాగా నాటుకుపోయింది.
ఎన్నికల్లో గెలవడానికి డబ్బు ఇస్తున్నారు. ఓటర్లు తీసుకుంటున్నారు. వారికి నచ్చిన వారికి ఓట్లు వేస్తున్నారు! ఎన్నికలు జూదంగా మారాయి!
గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ‘స్వర్ణాంధ్రప్రదేశ’ అంటూ ఇరవై సంవత్సరాలపాటు ఏకధాటిగా అధికారంలో వుండాలని ప్రణాళికలు వేసుకున్నారు. 2019లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా చంద్రబాబులాగానే ఆలోచన చేసి ఏకధాటిగా ఓటమి లేకుండా పాలన చేయాలని ఆశపడ్డారు. ఆ తర్వాత ఎన్నికల్లో 2024లో ఓడిపోయారు!
ఎన్నికల్లో పార్టీ నేతలు ఎన్ని వందలు, వేల కోట్లు గెలుపు కోసం ఖర్చు పెట్టినా ` ఓటర్ల తీర్పు వేరుగా వుంటూ వస్తోంది! ఎందుకంటే ఆయా పార్టీలు అధికారంలో వుండగా విపరీతంగా పెరిగిన అవినీతి వల్లనే! ప్రజలు కోరుకుంటున్నది మంచి పాలన, అభివృద్ధి. అందుకు భిన్నంగా పాలన నడుస్తుంటే ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారు. అందుకు నిదర్శనం గతంలో ఆయా పార్టీలు చేసిన తప్పులే సాక్ష్యం!
ప్రజలు అడిగినా, అడగకపోయినా సంక్షేమాలు అందిస్తున్నాం గనుక మనకు ఓటమి వుండదని గర్వపడితే ఓటమి తప్పదు! అధికారంలో వున్నా లేకపోయినా పార్టీల నాయకుల్లో నిజాయితీ, సచ్చీలత, అభివృద్ధిపట్ల పట్టుదల వుండి పని చేస్తేనే ఏ పార్టీ ప్రభుత్వమైనా అధికారంలో వుంటుంది. ఎన్నికల్లో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ఓటర్ల తీర్పు చివరకు న్యాయ బద్ధంగానే వుంటుంది!

