వర్చువల్‌గా నెల్లూరులో సర్వేపల్లి కట్ట ఇళ్ల పట్టాల పంపిణీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
రూ.600 కోట్ల విలువైన 22.31 ఎకరాల భూమిపై పేదలకు హక్కులు
701 మంది మహిళల పేరిట పట్టాలు… మహిళా సాధికారతకు పెద్దపీట
వచ్చే సంక్రాంతిలోగా నెల్లూరులో మరో 4,000 ఇళ్ల పట్టాల పంపిణీకి సీఎం ఆదేశం
రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు భద్రత, ఆత్మగౌరవం, ఆస్తి లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన
అమరావతి: దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ, వారి సొంతింటి కలను సాకారం చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నెల్లూరులోని సర్వేపల్లి కట్టలో 22.31 ఎకరాల భూమిపై 939 కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం అమరావతిలోని క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. సుమారు రూ.600 కోట్ల విలువైన ఆస్తిపై పేదలకు హక్కులు కల్పించామని తెలిపారు. మొత్తం లబ్ధిదారుల్లో 701 మంది మహిళలు ఉండటం మహిళా సాధికారతకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేసి, ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి పేదలకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం 28 నెలల పాలనలో ఆచరణలో చూపిస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు సుపరిపాలనకు నాంది పలికామని, పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం సుపరిపాలనలో భాగమని చెప్పారు. పేదల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు.
పేదలకు భద్రత, ఆత్మగౌరవం, శాశ్వత ఆస్తి
ప్రభుత్వ స్థలాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలకు భద్రత కల్పించడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక ఉద్యమంలా పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం, విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో 60 వేల కుటుంబాలకు రూ.52,000 కోట్ల విలువైన ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో అందించామని వెల్లడించారు. ‘ప్రతి ఒక్కరికి భద్రత, ఆత్మగౌరవం, ఒక ఆస్తి సమకూరాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పట్టాలు పొందేందుకు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు అత్యంత పారదర్శకంగా ఎలాంటి అవకతవకలు లేకుండా పేదలకు పట్టాలు అందిస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు రూ.900 కోట్ల విలువైన 2,600 ఇళ్ల పట్టాలను పేదలకు అందించినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా వివరించారు. వచ్చే సంక్రాంతి నాటికి మరో 4,000 పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. గత ఏడాది భగత్ సింగ్ కాలనీలో 1,407 కుటుంబాలకు 36 ఎకరాల భూమిపై పట్టాలు పంపిణీ చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.
ఇళ్ల స్థలాలతో పాటు మౌలిక వసతులు
పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇంటర్నెట్ సదుపాయం, మరుగుదొడ్లు, రహదారులు, డ్రైనేజీ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణాలు, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్లు అందించేలా కార్యాచరణ చేపట్టామన్నారు. పల్లెల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్న నేపథ్యంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా పట్టణాల్లో మౌలిక వసతులను మరింత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణాలను గ్రోత్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతున్నామని చెప్పారు.
సంక్షేమ పథకాల అమలులో రాజీ లేదు
సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా రాజీ పడటం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి నెలా సామాజిక పింఛన్ల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ పథకం ద్వారా మహిళలు ఇప్పటికే 100 కోట్ల ప్రయాణాలు చేయడం సంతృప్తి ఇచ్చిందన్నారు. దీపం-2 పథకం కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తామని తెలిపారు. విద్యుత్ చార్జీలను ఒక్క రూపాయి కూడా పెంచలేదని, ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. అన్నదాత సుఖీభవ, నేతన్న సేవలో, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ సేవలో వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. గీత కార్మికులకు ఎక్సైజ్ దుకాణాలు, వడ్డెరలకు మైనింగ్ లీజులు ఇచ్చి వారి జీవనోపాధికి తోడ్పడుతున్నామని చెప్పారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
అన్నింటికీ మించి రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. బుర్రిపాలెం నుంచి ఇటీవలే 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, ఇప్పటికే 28 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో 5.50 లక్షల ఇళ్లను అందించామని చెప్పారు. ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్లు అందరికీ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో గర్భకండ్రిక భూముల సమస్యకు పరిష్కారం చూపామని తెలిపారు. భూముల విషయంలో ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా హక్కులను పరిరక్షిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం రీసర్వే పేరుతో పట్టాదారు పాస్ పుస్తకాలపై తమ బొమ్మలను వేసుకున్నారని అన్నారు. వాటి స్థానంలో ఇప్పుడు ప్రభుత్వం రాజముద్రతో, అత్యంత భద్రతా ప్రమాణాలతో పాస్ పుస్తకాలను అందిస్తున్నట్టు తెలిపారు. సరిహద్దు రాళ్లపై గతంలో ముద్రించిన బొమ్మలను సైతం తొలగించామని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి ప్రజలకు ఉపశమనంగా కలిగించామన్నారు.
ఆర్థిక అసమానతలను తగ్గించడమే లక్ష్యం
రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా పీ4 వంటి కార్యక్రమాలను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్థిక అసమానతలను తగ్గించి సమాజంలోని ప్రతి కుటుంబానికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలన్నదే తమ సంకల్పమని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మద్దతుగా నిలిస్తే త్రిబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మేయర్లు, చైర్మన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. నీతి, నిజాయితీ, నిస్వార్థంతో పనిచేసే నాయకులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు వేసిన ఓటు ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి కుటుంబంలో, రాష్ట్రంలో మార్పునకు కారణమైందని ముఖ్యమంత్రి అన్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా గతంలో కంటే రెట్టించిన వేగంతో, ఉత్సాహంతో పనిచేస్తున్నానని తెలిపారు. పేదలకు శాశ్వత ఆస్తి కల్పించడంతో పాటు వారి జీవితాల్లో గౌరవం, భద్రత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన సమన్వయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అవధుల్లేని ఆనందంలో లబ్దిదారులు
నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో మంత్రి పి నారాయణ, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. మంత్రి నారాయణ లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలను స్వయంగా అందజేశారు. దశాబ్దాల నిరీక్షణకు తెరదించి పట్టాలు అందించిన ముఖ్యమంత్రికి మంత్రి నారాయణ, ఇంకా లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఇళ్ల పట్టాలు అందుకోవడంతో దసరా పండుగ ముందుగానే వచ్చిందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమకు ఎంతో తోడ్పాటునిస్తున్నాయని తెలిపారు. లబ్ధిదారుల ఆనందానికి హద్దులు లేవని మంత్రి నారాయణ ముఖ్యమంత్రికి వివరించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

