శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారుల విస్తృత ఏర్పాట్లు
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజైన ఆదివారం నిజ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి పర్వదినాన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మవారు బాలా త్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. నవరాత్రి ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు, సంబంధిత శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బాలా త్రిపురసుందరీ దేవి అలంకారంలో జగన్మాత..
శరన్నవరాత్రుల తొలిరోజున అమ్మవారు బాలా త్రిపురసుందరీ దేవి రూపంలో దర్శనమిస్తారు. బాల్యంలోని నిర్మలత్వం, పవిత్రత, జ్ఞానశక్తికి ప్రతీకగా ఈ రూపాన్ని భక్తులు ఆరాధిస్తారు. మనసు, బుద్ధి, చిత్తంపై అమ్మవారి అనుగ్రహం ఉంటుందని భక్తుల విశ్వాసం. అభయహస్తంతో దర్శనమిచ్చే జగన్మాతను పూజించడం ద్వారా జ్ఞానం, సద్బుద్ధి, మానసిక ప్రశాంతత కలుగుతాయని భక్తులు నమ్ముతారు.ఈ సందర్భంగా అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు వంటి శుభప్రదమైన రంగుల వస్త్రాలతో అలంకరణ చేసి, పాయసం, గారెలు తదితర నైవేద్యాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. బాలా త్రిపురసుందరీ దేవి ఆరాధనలో బాలికల పూజకు కూడా విశేష ప్రాధాన్యం ఉంది. రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించడం, నూతన వస్త్రాలు సమర్పించడం ఈ ఆరాధనలోని ప్రత్యేకత.

