- సుస్థిర పర్యాటకంతో ప్రకృతి పరిరక్షణ.. సమగ్ర అభివృద్ధి
- మన ప్రాంత ప్రత్యేకతలను ప్రపంచానికి చాటుదాం
- ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలు



విజయవాడ:ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా పర్యాటక శాఖ, స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్, రైజ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలోని డా. బి.ఆర్ అంబేద్కర్ స్మృతివనంలో ఘనంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలోని చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాల విశిష్టతను విద్యార్థులు, యువతకు పరిచయం చేసే విధంగా వివిధ పోటీలు నిర్వహించారు. వ్యాసరచన, చిత్రలేఖనం, సంప్రదాయ కళారూపాలు తదితర అంశాల్లో పోటీలు నిర్వహించగా, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యాటక ప్రాంతాల విశిష్టత, స్థానిక కళలు, సంస్కృతి, వారసత్వ సంపదను భావితరాలకు పరిచయం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి.


కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ప్రత్యేక చొరవ:
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ వారు ప్రత్యేక చొరవతో ప్రపంచ వారసత్వ దినోత్సవం, ప్రపంచ మ్యూజియమ్స్ దినోత్సవం ఇలా వివిధ విశిష్ట సందర్భాల నేపథ్యంలో ఆయా రంగాల ఘనతను చాటిచెప్పేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పర్యాటక అధికారి డా. కొల్లేటి రమేష్ అన్నారు. పర్యాటక రంగ అభివృద్ధితో స్థానిక కళాకారులు, హస్తకళాకారులు, చిన్న వ్యాపారులు, ఆతిథ్య రంగంతో పాటు యువతకు అనేక ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రకృతి వనరులను పరిరక్షిస్తూ, చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మన వారసత్వం మన గర్వం.. మన పర్యాటక ప్రదేశాలు మన ప్రాంతానికి ప్రపంచ గుర్తింపు తీసుకువచ్చే సంపద అని వివరించారు. పర్యాటకం కేవలం వినోదం, విహారయాత్రలకు మాత్రమే పరిమితం కాదని, ఒక ప్రాంత చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి అవకాశాలకు ఊతమిచ్చే శక్తివంతమైన రంగమని.. ఈ నేపథ్యంలో జిల్లాలో పర్యాటక రంగ సమగ్ర అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం కార్యక్రమం సందర్భంగా గుంటుపల్లి రైజ్, డీఆర్డీఏ ఆధ్వర్యంలో యువత, మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పర్యావరణ హిత పర్యాటక రంగ అభివృద్ధికి ఇవి అద్దంపట్టాయి. సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల కళా ప్రదర్శనలు, సంప్రదాయ నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.కార్యక్రమంలో డా. సమరం, స్థానిక పెద్దలు గురునాథంతో పాటు గోవర్ధన్, శివారెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కె.బాబ్జి, స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ వి.భారతీదేవి, కో ఫౌండర్ టి.మాధురి తదితరులు పాల్గొన్నారు.

