టాప్ న్యూస్అన్నవరం వ్రత పురోహితుల తీరుపై భక్తుల ఆవేదన..?

అన్నవరం వ్రత పురోహితుల తీరుపై భక్తుల ఆవేదన..?

*దానాల పేరుతో భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ ఆరోపణలు

ప్రజాభూమి ప్రతినిధి,అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వ్రతాలు నిర్వహించుకునేందుకు వచ్చే భక్తులకు కొందరు వ్రత పురోహితులు దానాల పేరుతో ఇబ్బందులు కలిగిస్తున్నారంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వ్రతం పూర్తయిన అనంతరం దానాల పేరుతో అదనపు మొత్తాలు ఇవ్వాలని ఒత్తిడి చేయడమే కాకుండా, డబ్బులు ఇవ్వకపోతే దేవుని అనుగ్రహం ఉండదన్న విధంగా మాట్లాడుతున్నారని కొందరు భక్తులు ఆరోపిస్తున్నారు. దీంతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారని, స్వామివారి వ్రతాన్ని ప్రశాంతంగా చేసుకునే పరిస్థితి లేకుండా పోతోందని వాపోతున్నారు.దూర ప్రాంతాల నుంచి ఎంతో భక్తిశ్రద్ధలతో అన్నవరం వచ్చే భక్తులు వ్రతం అనంతరం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం బాధాకరంగా ఉందని పేర్కొంటున్నారు. దేవస్థానం నిర్ణయించిన రుసుములు చెల్లించిన తర్వాత కూడా అదనంగా డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడం సరికాదని భక్తులు అంటున్నారు.అదేవిధంగా వ్రత మండపాల పరిసరాల్లో పనిచేసే కొందరు శానిటేషన్ సిబ్బంది కూడా వ్రతం చేసుకున్న భక్తులతో అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై దేవస్థానం అధికారులు తక్షణమే స్పందించి వ్రత మండపాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించాలని భక్తులు కోరుతున్నారు. దానాల పేరుతో భక్తులను ఎవరైనా ఒత్తిడికి గురిచేస్తున్నారా, భయభ్రాంతులకు గురిచేస్తున్నారా అనే అంశాలపై సమగ్ర విచారణ చేపట్టి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.భక్తుల విశ్వాసాన్ని కాపాడే విధంగా దేవస్థానం అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేసి, వ్రతాలు చేసుకునే ప్రతి భక్తుడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article