సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తునకు ఆదేశం
ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
సమీక్షలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

అమరావతి: విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారంలో సంబంధిత పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సచివాలయంలో సీఎం చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సింగపూర్ పర్యటన ముగించుకుని సచివాలయానికి వచ్చిన వెంటనే పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు. సాయికృష్ణ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశాలు ఇచ్చారు. దీనిపై సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తు చేయాలని సీఎం స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనలు చేశారు. ఈ సమావేశానికి సీఎస్ సాయి ప్రసాద్, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తదితరులు హాజరయ్యారు.

