Saturday, November 8, 2025

Creating liberating content

టాప్ న్యూస్ఆనందరెడ్డి అద్భుత మోసం..!

ఆనందరెడ్డి అద్భుత మోసం..!

  • ఎలక్ట్రిషన్‌గా జీవితం ప్రారంభం
  • తోట కిరణ్ పరిచయమే ఆర్థిక నేరాలకు మూలం
  • కోట్ల రూపాయల విలాసవంతమైన జీవితం వెనుక ఆర్థిక మాయాజాలం

ప్రజాభూమిప్రత్యేకప్రతినిధి – తిరుపతి

ఒక సాధారణ ఎలక్ట్రిషన్‌గా జీవితం ప్రారంభించిన బాలిరెడ్డి ఆనందరెడ్డి, నేడు కోట్ల రూపాయల విలాసవంతమైన జీవితం గడిపే స్థాయికి ఎదిగాడు. అయితే అతని ఎదుగుదల వెనుక ఉన్నదంతా మోసం, ఆర్థిక అవినీతి, మాయాజాలం అని పోలీసులు చెబుతున్నారు. తండ్రి ఒక సాధారణ రైల్వే ఉద్యోగి. చదువులో ఆసక్తి లేకపోవడంతో ఆనందరెడ్డి ఎలక్ట్రిషన్‌గా పనులు చేస్తూ తన జీవితాన్ని సాగించేవాడు. చిన్ననాటి నుంచే డబ్బు, విలాసం, మహిళల పట్ల విపరీతమైన ఆకర్షణ కలిగి ఉన్నాడని ఆయనను బాగా తెలిసినవారు చెబుతున్నారు. ఆ ఆకర్షణే అతని జీవితాన్ని వేరే దారిలో నడిపించింది. 19 ఏళ్ల వయసులోనే ఒక యువతిని ప్రేమలో పడేసి, ఆమెను గర్భవతిని చేశాడు. తర్వాత అనేక మలుపుల మధ్య పెళ్లి జరిగి, కొన్ని సంవత్సరాలకే కుటుంబ జీవితనికి స్వస్తి పలికి, జీవితంలో తిరిగి స్థిరపడాలనే ఉద్దేశంతో బెంగళూరుకి వెళ్లి ఎలక్ట్రిషన్‌గా పనిచేయడం ప్రారంభించాడు. అయితే అక్కడే అతని జీవితంలో అసలు మలుపు తిరిగింది.
బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న తోట కిరణ్ కుమార్‌తో పరిచయం కలగడం, ఆ పరిచయం స్నేహంగా మారడం, చివరికి అది ఆర్థిక నేరాలకు బీజం వేయడం జరిగింది. కిరణ్ కుమార్ మేధావిగా బోగస్ కంపెనీలు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమంగా డబ్బు సంపాదించే పథకాలు రచించగా, ఆనందరెడ్డి వాటి అమలులో కీలక పాత్ర పోషించాడు. వీరి స్నేహం ఆర్థిక మోసాల ద్వారా కోట్ల రూపాయలు సొంతం చేసుకొని, విలాసవంతమైన జీవితం గడిపారు. బీఎండబ్ల్యూ కార్లు, లగ్జరీ బంగ్లాలు, రోలెక్స్ వాచీలు, విదేశీ పర్యటనలు ఇవన్నీ ఆనందరెడ్డి జీవితంలో సాధారణ విషయాలుగా మారాయి. కొద్దికాలంలోనే అతడు ఆర్థిక నేరాల రారాజుగా పేరు తెచ్చుకున్నాడు.

కొంత మంది మహిళల జీవితాలతో ఆటలు

బోగష్ కంపెనీలు సృష్టించి అందులో చదువుకున్న, అందమైన అమ్మాయిలను జాబ్ పేర్లతో చేర్చుకొని ఆకర్షణగా మాట్లాడుతూ మోసానికి పాల్పడేవారు. అంతే కాకుండా ఆ అమ్మాయిలను శారీరకంగా వాడుకునే వారని అనేక ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన కేసుల్లో ఆనందరెడ్డి ఏ1 ముద్దాయిగా పోలీసులు గుర్తించారు. ప్రధాన మాస్టర్ మైండ్‌గా ఉన్న తోట కిరణ్ కుమార్ ఏ2 ముద్దయిగా పేర్కొన్నారు. కిరణ్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. సమాజంలో సాధారణంగా కనిపించే యువకుడు ఎలా కోట్ల రూపాయల ఆర్థిక మోసగాడిగా మారాడన్నదానికి ఆనందరెడ్డి కథ ఒక పెద్ద ఉదాహరణగా మారింది. పోలీసులు ఇప్పటికే కొన్ని బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి, సంబంధిత కంపెనీలపై దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే ఈ మోసం వెనుక ఉన్న అసలైన నెట్వర్క్ బయటపడే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈనెల 13న ఆనంద్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు, మాస్టర్ మైండ్ ఏ2 ముద్దయిగా పేర్కొన్న కిరణ్ కుమార్ జాడ లేదని తెలపడంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది. కొసమెరుపు ఏమిటంటే బాధితులు కోట్లు కట్టి మోసపోయాము అంటుంటే ఆనంద్ రెడ్డి మాత్రం కేవలం 2.5 కోట్లు మాత్రమే తీసుకున్నాను అంటున్నాడు. పోలీస్ లు కూడా 2.5 కోట్లు మాత్రమే అని కేసు ఫైల్ చేశారు. బాధితులు చెప్పిన మేరకు ఒక తిరుపతి లో మాత్రమే 15 కోట్లు వరకు లెక్క వస్తుంది. ఇలా నాలుగు ప్రధాన నగరాలలో మోసం చేసి దోచుకున్న డబ్బు విలువ 150 కోట్ల పై మాటే అని బాధితులు చెబుతున్నారు. అయితే నేడో, రేపో ఆనంద్ రెడ్డి బెయిలు పై వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కేసులో బాధితులకు న్యాయం జరిగేనా? అనేది బాధితుల కుటుంబల్లో ఆందోళన ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో? బాదితులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో వేచి చూడాలి!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article