Saturday, November 8, 2025

Creating liberating content

టాప్ న్యూస్ఈ "అమ్మ" మనసెంతో "లావణ్యం"

ఈ “అమ్మ” మనసెంతో “లావణ్యం”

  • 12 లీటర్ల చనుబాలు దానం
  • తల్లి పాల దాతగా ప్రాణదాత అయిన మాతృమూర్తి
  • అనంత మదర్స్ మిల్క్ బ్యాంకుకు పాలను అందించిన లావణ్య
  • ప్రోత్సహించిన భర్త, తల్లి
  • అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యాధికారుల అభినందనలు కేపీ. కుమార్, ప్రత్యేక ప్రతినిధి, అనంతపురము

ఆమె ఒక సాధారణ మహిళ.
నిరుపేద కుటుంబానికి చెందినది. అయితేనేమి మనసు ఎంతో గొప్పది. మాతృత్వానికి, అమ్మతనానికి పర్యాయపదంగా నిలిచింది. తన బిడ్డకు ఇవ్వగా.. మిగులు పాలను తన స్తన్యం నుంచి సేకరించి కొందరు అభాగ్యులైన పిల్లలకు అందేందుకు సహకరించి అనేకమంది తల్లులకు స్పూర్తి ప్రదాతగా నిలిచింది. కేవలం 26 రోజుల్లో 12 లీటర్ల చనుబాలను తన స్తన్యం నుంచి సేకరించి అనంత మదర్స్ మిల్క్ బ్యాంకుకు అందజేసి శభాష్ అనిపించుకుంది. ఆ మాతృమూర్తి పేరు లావణ్య. పాల దాతగా ప్రాణ దాత అయిన లావణ్య చేసిన అమోఘమైన, ఉదాత్తమైన సేవలకు అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి
వైద్యాధికారులు, అధికారుల ప్రశంసలందుకుంది.
ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది అక్టోబర్ 4న (04/10/2025) అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రసవం నిమిత్తం చేరింది. అనంతరం సాధారణ ప్రసవం ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో అనంత మదర్స్ మిల్క్ బ్యాంకు గురించి తనకు ఆస్పత్రిలోని వైద్యాధికారులు వివరించారు. దీంతో ఉత్తేజితరాలైన లావణ్య, తన భర్త బి.నవీన్ కుమార్ తో చర్చించి, ఆయనతో కలసి అనంత మదర్స్ మిల్క్ బ్యాంకుకు వచ్చింది. తాను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు తన పాలను అనంత మదర్స్ మిల్క్ బ్యాంకుకు దానం చేస్తానని హామీ ఇచ్చి ఆ మేరకు తన పాలను సేకరించి అందజేసింది. కాగా, ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. లావణ్య ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి తన ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత కూడా తన తల్లి వరలక్ష్మి ప్రోత్సాహంతో తన ఇంటిలోనే తన పాలను సేకరించి 12 లీటర్ల మేరకు తల్లిపాలను అనంత మదర్స్ మిల్క్ బ్యాంకుకు అందించింది. నిరుపేద కుటుంబానికి చెందిన లావణ్య, తన భర్త, తల్లి ప్రోత్సాహంతో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అనారోగ్యంతో అడ్మిట్ అయిన, తల్లి పాల కోసం తల్లడిల్లుతున్న శిశువులు, నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలు, పాలు లేనటువంటి శిశువులు, శిశు గృహ చిన్నారులు.. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే సత్సంకల్పంతో తన పాలను అందజేసింది. తన బిడ్డకు పాలు ఇస్తూ మిగులు పాలను అనంత మదర్స్ మిల్క్ బ్యాంకుకు దానం చేయడం ద్వారా ఒక మహత్తరమైన కార్యక్రమంలో పాలుపంచుకోవడం విశేషం . ఈ నేపథ్యంలో గురువారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి డిసిఎస్ ఆర్ఎంఓ డా.జి.హేమలత, న్యూట్రిషినిస్టు పల్లవి, రాధ, తదితరులు అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని మరుట్ల గ్రామంలో ఉన్న లావణ్య నివాసానికి వెళ్లి ఆమెను అభినందించి పాలను సేకరించారు. ఈ విషయంపై ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కే.ఎల్. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఎంతో గొప్ప ఔదార్యంతో తల్లిపాలను అనంత మదర్స్ మిల్క్ బ్యాంకుకు లావణ్య దానం చేసిందన్నారు. ఈ సందర్భంగా ఆయన లావణ్యను మనస్ఫూర్తిగా అభినందించి, మీలాంటి తల్లులు ఎందరికో ఆదర్శమని కృతజ్ఞతలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article