Saturday, November 8, 2025

Creating liberating content

టాప్ న్యూస్మఠం భూముల్లో భారీ ఆక్రమణలు

మఠం భూముల్లో భారీ ఆక్రమణలు

  • నేతలు, అధికారుల కుమ్మక్కుతో కోట్ల రియల్ ఎస్టేట్ దందా
  • అనుమతులు లేకుండా లగ్జరీ హోటల్స్, విలాసవంతమైన భవనాలు
  • విద్యుత్ మీటర్ ఎన్ఓసికి, బోరు అనుమతికి ప్రైస్ ట్యాగ్!

ప్రజాభుమిప్రత్యేకప్రతినిధి – తిరుపతి

తిరుపతి రూరల్ మండలం, గాంధీపురం పంచాయతీ పరిధిలోని తిరుమలనగర్ ప్రాంతంలో ఉన్న శ్రీహాథిరాం బాబాజీ మఠానికి చెందిన సుమారు 108 ఎకరాల విలువైన భూములు (సర్వే నంబర్లు 13, 14) ప్రస్తుతం ఆక్రమణలకు నిలయంగా మారాయి. ఉప్పరపల్లి రోడ్డునుంచి వైకుంఠపురం ఆర్చి వరకు విస్తరించిన ఈ భూములు, తిరుపతి నగరానికి మధ్యలో ఉండటంతో అత్యంత విలువైన రియల్ ఎస్టేట్ ప్రాంతంగా మారాయి. మార్కెట్ ధరల ప్రకారం 108 ఎకరాల భూముల విలువ సుమారు రూ.12 వేల కోట్లు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే ఈ విలువైన మఠం భూములను కొందరు రాజకీయ నాయకులు, స్థానిక నేతలు, ప్రభావవంతమైన వ్యక్తులు తమ ఆధీనంలోకి తీసుకుని అనధికారంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు విస్తరించుకుంటున్నారని సమాచారం. తుడా అనుమతులు లేకుండానే పంచాయతీ అధికారులు అనధికార అనుమతులు జారీచేస్తూ విలాసవంతమైన ఇళ్లు, లగ్జరీ హోటళ్లు, ఆఫీసు భవనాలు, వ్యాపార సముదాయాలు నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పంచాయతీ సర్పంచ్, సెక్రటరీ, కూటమి నేత కుమ్మక్కై ఈ రియల్ ఎస్టేట్ దందాకు తెర తీసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ కార్యాలయంలో ఎన్‌ఓసీలు, విద్యుత్, బోరు అనుమతులు చేతికి అందే స్థాయిలో జారీ అవుతున్నాయని సమాచారం. పంచాయతీ అధికారుల ఈ తీరుతో మఠం ఆస్తులు వారి అక్రమాలకు నిలయంగా మారాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సర్పంచ్ అనుచరులే ఈ భూములలో అక్రమ వసూలుదారులుగా వ్యవహరిస్తూ, ప్రతి నిర్మాణానికి కొంత మొత్తాన్ని తీసుకుంటున్నారనే సమాచారం స్థానిక వర్గాల నుంచి వెల్లువడుతోంది. ఇక తుడా అధికారులు కూడా ఈ అక్రమాలకు సహకరిస్తూ, మౌనంగా ఉండటంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తిరుపతి నగర పరిధిలోనే ఉన్న ఈ భూములు ఇంత పెద్ద స్థాయిలో ఆక్రమించబడుతున్నా, జిల్లా పరిపాలన నుండి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారి తీస్తుంది. స్థానికులు పలుమార్లు అధికారులను సంప్రదించినా “చూస్తాం” “పరిశీలిస్తాం” అన్న సమాధానం మాత్రమే వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మఠం ఆస్తులు దేవుడి ఆస్తులు. వాటిని కొందరు రాజకీయ ఆశ్రయంతో దోచుకుంటున్నారు. ప్రభుత్వం తక్షణం విచారణ జరపాలని స్థానిక పెద్దలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ భూముల వ్యవహారంలో అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు మౌనం వహించడం వెనుక దొంగచాటుగా జరుగుతున్న బినామీ లావాదేవీలే కారణమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తుడా అనుమతులు లేకుండానే రోడ్డు పక్కన భారీ కమర్షియల్ కట్టడాలు, గెస్ట్ హౌస్‌లు, లగ్జరీ హోటళ్లు నిర్మించబడటం చూస్తే నిబంధనలు కేవలం పేరుకే ఉన్నాయా? అనే అనుమానం కలుగుతోంది. అంతే కాకుండా పంచాయతీ ప్రజాప్రతినిధి ఎకరా పైగా ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కొనసాగుతున్న నిర్మాణాలపై అధికార దర్యాప్తు అవసరమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మఠం భూములను తిరిగి మఠం ఆధీనంలోకి తీసుకువచ్చి, ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని హిందూ సంఘాలు, సామాజిక ప్రతినిధులు, ప్రజలు కోరుతున్నారు. ఉన్నతాధికారుల చర్యలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article