- దర్శనాలకూ, ప్రసాదాలకు ప్రత్యేక రేట్లు
- భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్న అవినీతి
ప్రజాభూమిప్రత్యేకప్రతినిధి – తిరుపతి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం సనాతన హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన క్షేత్రంగా గుర్తింపు పొందింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ధర్మపత్నిగా అమ్మవారు పూజలందుకుంటున్నారు. తిరుమలలో స్వామివారిని దర్శించిన ప్రతి భక్తుడు తిరుచానూరులో అమ్మవారిని దర్శించుకోవడం సాంప్రదాయం. అయితే ఇటీవలి కాలంలో ఈ పవిత్ర స్థలంలో భక్తి కంటే లావాదేవీలు, ధర్మం కంటే దుర్మార్గం ఎక్కువైందన్నది భక్తుల్లో పెరుగుతున్న ఆవేదన.
భక్తుల విశ్వాసాన్ని అడ్డంగా దోపిడీ చేస్తున్న అవినీతి తతంగం చుట్టూ ఆలయ వాతావరణం ముసురుకుపోయింది. దర్శనాల పేరుతో కొందరు అధికారులు, మధ్యవర్తులు కుమ్మక్కై ప్రత్యేక టికెట్లు, బ్రేక్ దర్శనాలు, అభిషేకాలు, తిరుప్పావడ సేవలు తమ సొంత ఆధీనంలోకి చేసుకున్నారని సమాచారం. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, విజిలెన్స్ తదితర శాఖలకు చెందిన కొంతమంది వ్యక్తులు ప్రోటోకాల్ ముసుగులో ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనాలు, సేవలను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇక సాధారణ భక్తుల పరిస్థితి దయనీయంగా మారింది. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి దర్శనం కోసం ఇబ్బంది పడుతుంటే, కొందరు దళారులు ఎలాంటి క్యూలేకుండా సులభంగా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి దర్శనం పూర్తి చేసుకుంటున్నారు. ఈ అన్యాయం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడమే భక్తులకో ఆశ, కాని ఇక్కడ మాత్రం డబ్బు, ప్రాధాన్యతే ముఖ్యమైపోయాయని పలువురు వేదన వ్యక్తం చేస్తున్నారు. అదంతా దర్శనాలవరకే పరిమితం కాలేదు. అమ్మవారి ప్రసాదాలు, మూల వార్లకు వేసే పూలమాలలు కూడా వ్యాపార వస్తువులుగా మారాయి. ప్రతిరోజు ఆలయ సేవల్లో పాల్గొనే కొందరికి కావలసినంత ప్రసాదాలు, పూలమాలలు ఎన్ని సార్లు అడిగినా అందుతుండగా, సాధారణ భక్తులు మాత్రం చిన్న కప్పు ప్రసాదం కోసం క్యూలలో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అసమానత భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తమవుతోంది. భక్తులు చెబుతున్నట్టు పుణ్యక్షేత్రంలో భక్తి స్థానంలో డబ్బు లావాదేవీలు చోటుచేసుకోవడం విచారకరం. అమ్మవారి అనుగ్రహం పొందేందుకు కాకుండా కొందరు లాభాల కోసం మాత్రమే ఈ పవిత్ర స్థలాన్ని వినియోగిస్తున్నారని వాపోతున్నారు. ఆలయంలో జరుగుతున్న ఈ అవినీతి తతంగంపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, భక్తులకు సమాన హక్కులు కల్పించాలనే డిమాండ్‌తో భక్తులు సామాజిక వేదికల్లో కూడా స్వరం పెంచుతున్నారు. ధర్మపాలనకు నిలయంగా పేరుగాంచిన తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ఇటువంటి అవినీతి కొనసాగడం హిందూ భావనలను తీవ్రంగా దెబ్బతీస్తోందని భక్తుల ఆవేదన. అధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అవినీతి మూలాలను నిర్మూలించాలి. అమ్మవారి ఆలయ గౌరవం, పవిత్రత కాపాడేలా తక్షణ చర్యలు తీసుకోవాలని భక్తులు, హిందూ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

