(కర్నూలు బస్సు ప్రమాదానికి..
ఈ కవితకు సంబంధం లేదు..
కానీ చాలావరకు ప్రమాదాలు
మానవ తప్పిదాల వల్లనే
జరుగుతున్నాయి..
బండి నడిపేటప్పుడు
నిర్లక్ష్య ధోరణి..
నిబంధనలు పాటించకపోవడం..
మద్యం మత్తులో చోదనం..
అనవసర చేదనం..
బాధ్యతారాహిత్యం..
పిల్లలకు బండి ఇవ్వడం..
ఇలాంటివి ఎన్నో..
కారణాలు..
మొన్న నేను చూసాను..
జాతీయ రహదారిపై
ఒక పద్నాలుగు సంవత్సరాల కుర్రాడు పన్నెండేళ్ళ అబ్బాయికి బుల్లెట్ నడపడం
నేర్పుతున్నాడు..ఇలాంటివి
జరుగుతున్నప్పుడు ఎవరిని
అనాలి..అదుపు చెయ్యని
పోలీసులనా..ఆ కుర్రాళ్ళ
టెండపరితనాన్నా..
అంత చిన్నవాళ్ళకి
బండి ఇచ్చిన పెద్దవాళ్ళనా..
సరే..ఒక్కో ప్రమాదానికి
ఒక్కో కారణం..
ప్రమాదాలు జరుగుతున్నాయి..
ప్రాణాలు పోతున్నాయి..
జరిగేటప్పుడు బాధ..
ఆవేశం..ఆవేదన..
రెండ్రోజులు గడిచాక
అంతా మామూలే..
విషాదాంతాలకు
అంతం ఉండడం లేదు)
✍️✍️✍️✍️✍️✍️✍️✍️
వేగమే
అతి పెద్ద రోగం..
అదే మృత్యుదేవతలో
సగభాగం..
ఇది స్పీడు యుగం..
నిజమే..
అలాగని నీకు నువ్వే అందుకోవడం
ఎందుకో చావు రాగం..
మరణమృదంగం..!
ఎన్ని రోడ్డు ప్రమాదాలు..
ఎన్నెన్ని జీవితాల్లో
అంతులేని విషాదాలు..
పెద్దదిక్కును పోగొట్టుకున్న
కుటుంబాలు..
శోకసంద్రాలు..
బిడ్డలను కోల్పోయిన తల్లుల
తీరని గర్భశోకాలు…
పొత్తిళ్ళలో పెరిగిన బిడ్డకే
కొరివి పెట్టడం ఎంత కష్టం
కాష్టంలో చితి మంట
అయ్య గుండెలో
ఎప్పటికీ ఆరని మంట
కట్టెదుట కాలుతుంటే
కొడుకు శవం..
నాయన దుఖం ఆపడం
ఎవరి వశం!?
అదిగో..
ఓ ఆడకూతురు
నిన్నగాక మొన్ననే వేసింది అతగాడితో ఏడడుగులు..
అంతలోనే నెత్తుటి
మడుగులో అతడు..
మూడో నాడే
ముంచేసిపోయిన మగడు..
సాయంకాలం షికారు పోదాం..
సిద్ధంగా ఉండమన్న
పెనిమిటి
ఇంకా రాడేమిటి..
చక్కగా సింగారించుకుని మగడికి ఇష్టమని నుదుటిన పెద్ద బొట్టెట్టుకుని
వాకిలిలో ఎదురు చూస్తున్న ఇల్లాలికి ఆ బొట్టే చెదిరిపోయిందన్న కబురు..
సముద్రతీరానికి పోదామన్న భర్త తిరిగిరాని తీరాలకు
పయనమైపోయె..
యానాళ్ళలో అలిగి
ఆత్తోరి పేనాలు తోడేసి
అప్పటికప్పుడు అప్పు చేసి
మామ అలక కట్నంగా
కొనిచ్చిన బుల్లెట్టు
కొత్త అల్లుడి
ప్రాణాలే మింగేసింది..
కళ్ళ ముందు బొట్టు చెడిన బిడ్డ
నడిరోడ్డుపై అల్లుడి నెత్తుటి గడ్డ
ఒక్కో ప్రమాదం వెనక
ఎంతెంత విషాదం!
ఇంజనీరింగ్ చదువుతున్న కొడుకు..
కాంపస్ ఇంటర్వ్యూలో
తానే టాపర్..
ఆ ఆనందంలో మిత్రబృందం
ఆ రాత్రే బైకులపై
లాంగ్ రైడ్…
గుద్దేసి ఎదురుగా వస్తున్న
కారు బంపర్…
త్రుటిలో కాటిలో..
అమ్మని నాన్నని ఓదార్చడం
ఎవరి తరం..
ఏదో ఒక ఇంట్లో
ఇలా జరుగుతూనే ఉంది
నిరంతరం!
డాక్టరై ఒకనాడు పదిమంది ప్రాణాలు నిలుపుతాడనుకున్న సుతుడు మరునాడు
రోడ్డుప్రమాదంలో హతుడు
ఇప్పుడిక ఆ నాన్న
జీవన్మృతుడు!
ఒక్కసారి ఆలోచించండి..
అరవైలో ఇరవై పసలేదు..
ఇరవైలో ఎనభై పనిలేదు..
నెత్తిన ఓ హెల్మెట్..
వేగానికో లిమిట్..
ఫాలో అవుతూ రూలు…
సోలోగా పోయినా..
స్లోగా పో..
జంటగా వెళ్ళినా జాలిగా
తిరిగి..తిరిగి రా!
స్పీడు కోలాటం కాదు..
అదో సంకటం..
ప్రమాదకరమైన ఉబలాటం..
నీతో పాటు ఇంకొందరి ప్రాణాలతో చెలగాటం..
తిరగరాస్తూ ఎందరెందరిదో లలాటం!
ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286
7995666286

