- అధికార దుర్వినియోగం, అక్రమ నియామకాలు, ఉద్యోగులపై ఒత్తిడి
- చిట్టమూరు మండల టీడీపీ కార్యకర్త నాగముంతల వెంకటేష్ ఆరోపణలు
ప్రజాభూమి ప్రత్యేకప్రతినిధి(అమరనాథ్) – తిరుపతి

తిరుపతి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డ్వామా)లో అవినీతి ముసురుకుంది అన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ప్రాజెక్ట్ డైరెక్టర్ (పిడి)పై కోట్ల రూపాయల అవినీతి, అధికార దుర్వినియోగం, అక్రమ నియామకాలు, ఉద్యోగులపై మానసిక ఒత్తిడి వంటి తీవ్రమైన ఆరోపణలతో జిల్లా పరిధిలో చిట్టమూరు మండలానికి చెందిన ఓ టీడీపీ కార్యకర్త నాగముంతల వెంకటేష్ ఆరోపణలు చేశారు.
వెంకటేష్ గత కొంతకాలం క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తిరుపతి పిడి గత 9 సంవత్సరాలుగా డ్వామాలో పలు కీలక స్థానాల్లో కొనసాగుతూ, చిత్తూరు జిల్లాలో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆదేశాల మేరకు పుంగనూరు, గంగాధర నెల్లూరు, గూడూరు మండలాల్లో విస్తృత అవినీతి కార్యక్రమాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ, తప్పుడు పనులు చూపించి భారీ మొత్తంలో బిల్లులు చెల్లింపులు జరిగినట్లు ఆరోపించారు. 2019-21 మధ్య పుంగనూరు నియోజకవర్గంలో జగనన్న కాలనీ చదును చేసే పనుల పేరుతో రూ.60 కోట్ల బిల్లులను పనులు చేయకుండానే చెల్లించబడ్డాయని ఆయన ఆరోపించారు. డ్వామా ఆధ్వర్యంలో నడుస్తున్న వాటర్‌షెడ్ ప్రాజెక్టుల్లో కూడా కోట్ల రూపాయల అవకతవకలు చోటుచేసుకున్నట్లు సోషల్ ఆడిట్ రిపోర్టులు స్పష్టంగా వెల్లడించాయని ఆయన తెలిపారు. గూడూరు మండలంలో ఏపిఓలుగా నియమితులైన కొందరికి ఒకే మండలంలో రెట్టింపు వేతనాలు చెల్లించడం, విధులు నిర్వర్తించకుండానే కొంతమంది అధికారులకు నెలవారీ జీతాలు అందించడం వంటి అవకతవకలను వెంకటేష్ వివరించారు. (ఎంజీఎన్ఆర్ఇజిఎస్) పథకం కింద తిరుపతి రూరల్ మండలంలోని పాతకాలువ గ్రామపంచాయతీలో ఏ పనులు జరగకుండానే రూ.70 లక్షల బిల్లులు చెల్లించారని, ఇది తీవ్రమైన అవినీతి ఉదాహరణ అని పేర్కొన్నారు. తిరుపతి డ్వామాలో కార్యాలయంలో అధిక ఒత్తిడితో పలువురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఆరోపించారు. డ్వామా పిడి కార్యాలయ అటెండర్లను తన వ్యక్తిగత పనుల కోసం వినియోగించడం, అధికార స్థానాన్ని దుర్వినియోగం చేయడమేనని అన్నారు. ఇలాంటి వ్యవహారాలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వ నిధులు నిరుపేదల అభివృద్ధికి కాకుండా కొందరి వ్యక్తిగత లాభాల కోసం దారితప్పుతున్నాయని, దీనిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు ప్రతులను ఉప ముఖ్యమంత్రి కొనెదల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిపారు. ఈ ఆరోపణలతో తిరుపతి జిల్లాలోని పరిపాలనా వర్గాల్లో కలకలం రేగింది. డ్వామాలో జరుగుతున్న అవకతవకలపై ఇప్పటికే పలువురు ఉద్యోగులు, కాంట్రాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రజా నిధుల దుర్వినియోగంపై సాధారణ ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేదల పునరావాసం, గ్రామీణాభివృద్ధి పేరుతో నడుస్తున్న డ్వామా ప్రాజెక్టుల్లో ఇలాంటి అక్రమాలు వెలుగుచూసిన నేపథ్యంలో, ఈ ఆరోపణలు ప్రభుత్వం దృష్టిలో ప్రాధాన్యత పొందే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ అంశంపై అధికారిక స్పందన వెలువడలేదు. అయితే, రాష్ట్ర స్థాయి విచారణ కమిటీ ఏర్పాటుకు అవకాశముందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. డ్వామాలో నిజంగా అవినీతి జరిగిందా? లేక రాజకీయ దురుద్దేశ్యంతో ఆరోపణలు చేసారా? అన్న ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో బయటపడనుంది.

