Sunday, November 9, 2025

Creating liberating content

టాప్ న్యూస్అధికారులే అక్రమార్కులైతే - చట్టాన్ని కాపాడేది ఎవరు?

అధికారులే అక్రమార్కులైతే – చట్టాన్ని కాపాడేది ఎవరు?

  • తుడా ప్లానింగ్ అధికారిని, డిఎల్పిఓల అవినీతి కథలతో
  • కలుషితమవుతున్న తిరుపతి జిల్లా పరిపాలన
  • జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి శ్రమ వృధా

ప్రజాభూమి ప్రత్యేకప్రతినిధి – తిరుపతి

తిరుపతి జిల్లా అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి రాత్రి పగలు పనిచేస్తూ తిరుపతి జిల్లాను విజినరీ జిల్లాగా నిలపాలని ప్రపంచస్థాయిలో తిరుపతికి ప్రత్యేక గుర్తింపు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లాలో అనేక సంస్థలను నెలకొల్పుతూ టూరిజం డెవలప్మెంట్ చేస్తూ, తిరుపతి నగర అభివృద్ధి కోసం వారు పాటుపడుతున్నారు. అయితే ప్రజాసేవ అనే పవిత్ర పదం నేడు కొందరు అధికారుల చేత అవమానింపబడుతోంది. చట్టం కాపాడటమే తమ బాధ్యతగా భావించాల్సిన వారు, ఇప్పుడు అదే చట్టాన్ని తమ కాసుల కోసం మడత పెట్టే స్థాయికి దిగజారిపోయారని ప్రజల మధ్య ఆవేదన వ్యక్తమవుతోంది. తిరుపతి జిల్లాలోనూ, తుడా పరిధిలోనూ అక్రమాలు, అవినీతి, స్వార్థపూరిత విధానాలు పూత పూసిన పాముల్లా వ్యాపిస్తున్నాయనే వాస్తవం ఇప్పుడు బయటపడుతోంది. కాసులే కంచాలుగా, అవినీతి సంపాదన ఆహారంగా మార్చుకున్న అధికారులు ఈ సమాజానికి మాయని మచ్చగా మిగిలిపోతున్నారు.

తుడా (తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)

తుడా ప్రధాన బాధ్యత నగరాభివృద్ధి, సమగ్ర ప్రణాళిక, ప్రజా సదుపాయాల రూపకల్పన. కానీ ఆ కార్యాలయంలో కాసుల వాసన ఇప్పుడు చట్టాల కంటే బలంగా వ్యాపిస్తోంది. ప్లానింగ్ విభాగాధికారిణి దేవిక కుమారి పేరు ఇప్పుడు అనేక అక్రమాల నడుమ చర్చనీయాంశమైంది. భవన అనుమతులు ఇవ్వడంలో, డెవలప్మెంట్ ఫీజులు నిర్ణయించడంలో, ప్రణాళికలు ఆమోదించడంలో ఆమెకు ధనమే ప్రమాణంగా మారిందని భవన యజమానులు సైతం వాపోతున్నారు. తన ధనబలంతో తుడా ప్లానింగ్ అధికారిణి పదవిని కాపాడుకుంటూ, తనకు సన్నిహితులను డిప్యూటేషన్ పేరుతో తుడాకు తెచ్చుకొని, వారిని కూడా వసూళ్ల యంత్రంగా మలచిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తుడా భవన నిర్మాణ అనుమతులు పొందాలంటే ప్రణాళిక కంటే పన్ను – పన్నుకంటే పంచు అనే వాతావరణం నెలకొంది.

జిల్లా స్థాయిలో మారని పరిస్థితి

ఇక జిల్లా స్థాయిలో పరిస్థితి కూడా అంతే భయానకంగా మారింది. తిరుపతి జిల్లా డిఎల్పిఓ సురేష్ నాయుడు అవినీతి చుట్టంలో కూరుకుపోయాడనే ఆరోపణలు పెరుగుతున్నాయి. జిల్లాలో పరిధిలోని పంచాయతీ సెక్రటరీలతో ప్రత్యేక బంధం ఏర్పరచుకుని, వారిని కలెక్షన్ ఏజెంట్లుగా మార్చేశాడని సమాచారం. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ భవన నిర్మాణం మొదలైతే, అక్కడ ఆ సెక్రటరీలు హాజరై పని చక్కగా జరగాలంటే కొంత కాసులు ముట్టాలి. ఆ సూట్‌కేసులు, ఫైళ్ళ రూపంలో పైకి చేరుతున్నాయన్నది సమచారం. ప్రజాస్వామ్యంలో చట్టం అంటే పౌరుల రక్షణకవచం. కానీ ఆ కవచాన్ని కాపాడాల్సినవారే చీల్చేస్తే, న్యాయం ఎక్కడ వెతుక్కోవాలి? తుడా, జిల్లా స్థాయి కార్యాలయాల ఈ అవినీతి తంతు ఇప్పుడు తిరుపతి ప్రజలలో భయానక నిరాశను కలిగిస్తోంది. చట్టాన్ని కాపాడే వారు చట్టాన్ని మింగేస్తే – ప్రజలకు దిక్కెవరు? అన్న ప్రశ్న ప్రతి భవన యజమాని, ప్రతి రైతు, ప్రతి పౌరుని నోటి వినిపిస్తోంది. పట్టణాలు అభివృద్ధి చెందాలి అంటే కాగితాల మీద కాదు నిబద్ధతతో పని చేసే అధికారులతోనే సాధ్యమవుతుంది. కానీ తిరుపతి జిల్లాలో కష్టపడే నిజాయితీగల అధికారులు రాత్రింబవళ్లు ప్రజల కోసం శ్రమిస్తుంటే, మరికొందరు మాత్రం ప్రజల నిధులను, నమ్మకాన్ని, అమ్ముకుంటూ వ్యక్తిగత సంపాదనకు వాడుకుంటున్నారు. ఇది కేవలం అవినీతి కాదు – ప్రజాస్వామ్యంపై చేసిన ద్రోహం. చట్టాన్ని కాపాడాల్సినవారే అక్రమార్కులైతే, చట్టం కాపాడేది ఎవరు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article