Sunday, November 9, 2025

Creating liberating content

టాప్ న్యూస్అవినీతికి అగ్రస్థానం !

అవినీతికి అగ్రస్థానం !

  • అక్రమాలకు అడ్డాగా తిరుపతి రూరల్
  • ఆకాశమే హద్దుగా భవనాలు
  • కాసులు ఇస్తే అనుమతులతో పనిలేదు
  • కలెక్షన్ ల వేటలో అధికారులు

ప్రజాభూమి ప్రత్యేకప్రతినిధి(తురక అమరనాథ్) – తిరుపతి

తిరుపతి నగరం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో రూరల్ మండలం అభివృద్ధి కేంద్రంగా మారాల్సింది. కాని ఆ ప్రాంతం ఇప్పుడు అవినీతికి అగ్రస్థానంగా, అక్రమాల అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి అర్బన్ పరిధి తక్కువగా ఉండటం వల్ల భవిష్యత్తు నగర విస్తరణ రూరల్ ప్రాంతాలకే దారితీస్తోంది. ఈ అవకాశాన్ని అక్రమార్కుల మాఫియా, లంచగొండి అధికారుల కుమ్మక్కుతో దుర్వినియోగం చేస్తూ అనుమతులు లేకుండానే భవనాలు కట్టి, కోట్లలో లాభాలు గడిస్తున్నారు.

అధికారులే అక్రమాల శ్రేయోభిలాషులు

ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు, ప్రభుత్వ విభాగాలు ఈ అక్రమాలను అడ్డుకోవాల్సిన బాధ్యత కలిగి ఉన్నప్పటికీ, లంచగొండి అధికారులు వసూల్లో మునిగిపోయాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఫైర్, పాల్యూషన్ లాంటి విభాగాల్లోని కొంతమంది అధికారులు కాసులు ఇస్తే చాలు, అనుమతి అవసరమే లేదు అనే స్థాయికి దిగజారిపోయారు. సంబంధిత శాఖ సిబ్బంది రోజువారీగా అక్రమ వసూళ్లు చేస్తూ పెద్దవారికి వాటాలు చేరవేస్తున్నారని లోతట్టు వర్గాలు చెబుతున్నాయి. ఈ లంచాల చక్రంలో అధికారులు, కాంట్రాక్టర్లు, మధ్యవర్తులు అందరూ ఒకే గొలుసులో కట్టుకుపోయారు.

అనుమతి మూడు, నిర్మాణలు ఆరు

తిరుపతి–తిరుచానూరు ప్రధాన రహదారిపై కేఎన్ఎం పెట్రోల్ బంక్ ఎదురుగా, స్టార్ బక్స్ హోటల్ పక్కన ఉన్న భవనం ఈ అవినీతి రాజ్యానికి నిదర్శనం. శ్రీనివాసపురం పంచాయతీ ద్వారా మూడు అంతస్తులకే అనుమతి పొందినా, కాసులు కవర్ చేయడంతో ఆరు అంతస్తులకుపైగా నిర్మాణం జరిగిందని సమాచారం. గాంధీపురం పంచాయతీ చదలవాడ పెట్రోల్ పంప్ పక్కన ఇలా చెప్పుకుంటూ పోతే రహదారిపైనే అనేక అక్రమ భవనాలు వెలిసాయి. ఈ భవనం కళ్ల ముందే పెరిగినా, అధికారులు చూడనట్లు నటించడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇంకొంచెం ముందుకెళ్తే తిరుచానూరు సింధు పార్క్ (ఏటుబీ) హోటల్ ఎదురుగా, పక్కన మరో రెండు భవనాలు కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాలే. వర్షా విశ్వనాథ్ నగర్‌లోనూ పెద్ద భవనం అనుమతులు లేకుండానే కట్టబడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి ప్రధాన రహదారిపైనే ఇలాంటి భవనాలు స్పష్టంగా దర్శనమిస్తూనే ఉన్నాయి. అయినా సంబంధిత శాఖలు ఏమీ చూడనట్లే వ్యవహరిస్తున్నాయి.

ప్రభుత్వం కళ్ళు మూసుకుందా? ప్రజల ప్రశ్న

ఈ పరిస్థితులు ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నాయి. ఇంత అవినీతి, ఇంత బహిరంగ అక్రమాలు కళ్ల ముందే జరుగుతున్నా, కూటమి ప్రభుత్వం కళ్ళు మూసుకుందా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి చర్చలో వినిపిస్తోంది. విమర్శకులు కూడా ఇదే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. తిరుపతి వంటి ఆధ్యాత్మిక నగరంలో చట్టాలను, భవన నిబంధనలను ఈ స్థాయిలో ఉల్లంఘించడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని నిపుణులు సూచిస్తున్నారు. నగర అభివృద్ధి పేరుతో రూరల్ ప్రాంతాలను మాఫియా రాజ్యంగా మారనివ్వకూడదని వారు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత శాఖలపై దృష్టి పెట్టాలన్న ప్రజా డిమాండ్

తిరుపతి రూరల్ అభివృద్ధి చెందాలి కానీ అక్రమాల అడ్డాగా కాకూడదు. ఈ లంచగొండి వ్యవస్థపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని, లేదంటే భవిష్యత్తులో తిరుపతి నగరం పేరు అక్రమాల కేంద్రంగా మారిపోవడం ఖాయమని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనలపై జిల్లా కలెక్టర్, తిరుపతి స్మార్ట్ సిటీ అధికారులు తక్షణమే దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లంచాలు, అక్రమ భవనాలు, అనుమతి మోసాలపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article