- యుద్ధ ప్రాతిపదికన సమస్యలను పరిష్కరిస్తున్నాం
- ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం విధులు నిర్వర్తిస్తోంది
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ















విజయవాడ,ఇంద్రకీలాద్రి నుంచి:భక్తుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఏర్పాటుచేసిన క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్ బ్యాక్ విధానం ద్వారా వచ్చే భక్తుల అభిప్రాయాలను… సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో తొలిరోజు అయిన సోమవారం ఆయన వినాయకుని గుడి ప్రారంభం నుంచి చిన్న రాజగోపురం వరకు కాలినడకన సామాన్య భక్తుల క్యూలైన్ ద్వారా నడిచి వచ్చి భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పసి పిల్లలకు పాల లభ్యత, మంచినీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు వంటి అంశాలను పరిశీలించారు. 15 నిమిషాలలో తాను నడక దారిన చిన రాజగోపురం చేరుకున్నానన్నారు. సాధారణ భక్తుల సంతృప్తికర దర్శనం కోసం జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం ఏడున్నర గంటలకు ప్రారంభమైన దర్శనం మధ్యాహ్నానికి 20,000 మంది పైగా దర్శనం చేసుకున్నారని తెలిపారు. భక్తులు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా చాలా ఆహ్లాదకర వాతావరణంలో, ఆధ్యాత్మిక వాతావరణంలో దర్శనం చేసుకుంటున్నారన్నారు. అదే సమయంలో విఐపి దర్శనాల కోసం ప్రత్యేకంగా కేటాయించిన సమయంలో మాత్రమే ప్రముఖులు కూడా వస్తూ సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో ఇదే రీతిన సామాన్య భక్తుల సంతృప్తికర దర్శనమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం సేవలందించాలని ఆదేశించారు.
కలెక్టర్ విస్తృత తనిఖీలు
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా సోమవారం తొలిరోజు వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు భక్తులకు చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో వారి నుంచే అడిగి తెలుసుకున్నారు. వినాయక టెంపుల్, విఎంసి పాయింట్, కేశఖండనశాల, సీతమ్మ వారి పాదాలు, పున్నమి ఘాట్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. వైద్య శిబిరాలలో చేసిన ఏర్పాట్లు కూడా తనిఖీ చేశారు.

