రైతులకు తోడుగా నిలిచిన వైసీపీ శ్రేణులను అభినందిస్తున్నానంటూ జగన్ ట్వీట్
తాడేపల్లి:-
కూటమి ప్రభుత్వ దగా పాలనపై రైతన్నల తొలి పోరాటం విజయవంతమైంది అంటూ వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియాలో స్పందించారు. చంద్రబాబు చేస్తున్న మోసా లను నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతులు ఇవాళ రోడ్డెక్కారని వెల్లడించారు. రైతులకు తోడుగా నిలిచిన వైసీపీ కార్యకర్తలు, నేతలకు అభినందనలు తెలుపుతున్నానని జగన్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ నేతల అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కేవలం ఆరు నెలల పాలనకే చంద్రబాబుపై ప్రజావ్యతిరేకతకు నేటి కార్యక్రమం అద్దంపట్టిందని స్పష్టం చేశారు. రైతన్నల ఆందోళనలను అడ్డుకోవడానికి చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని పార్టీ నేతలపై, రైతులపై గృహ నిర్బంధాలకు దిగారని జగన్ ఆరోపించారు. అయితే ఈ బెదిరింపులకు వారు ఎక్కడా వెనకడుగు వేయకుండా తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయమని పేర్కొన్నారు. “రైతులకు ప్రతి ఏటా రూ.20 వేల పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చారు… ఆ హామీని ఎందుకు అమలు చేయడంలేదని రైతులు ప్రశ్నించడం తప్పా చంద్రబాబు గారూ! ధాన్యం కొనుగోళ్లను మిల్లర్లకు, మధ్యవర్తులకు అప్పగించడంతో ప్రతి బస్తాకు రూ.300 నుంచి రూ.400 నష్టపోతున్నామని రైతులు నిలదీయడం తప్పా? పంటకు కనీస మద్దతు ధర అడగడం నేరమా? ఉచిత పంటల బీమా పథకం ఎత్తివేసి తమపై అదనపు భారం మోపుతున్నారని రైతులు నిలదీయడం తప్పా? వారు తమ డిమాండ్లకు సంబంధించిన పత్రా లు కలెక్టర్లకు అందజేయకూడాదా? తీవ్రంగా నష్టపోతున్నా రైతులు ఇలా చేయకూడదని అడ్డుపడడం చంద్రబాబు రాక్షస మనస్తత్వానికి నిదర్శనం. రైతుల తరఫున వైసీపీ పోరా టం కొనసాగిస్తుంది” ని జగన్ స్పష్టం చేశారు.