మంచు మోహన్ బాబు కుటుంబంలో ఫ్యామిలీ పంచాయితీలు తారస్థాయికి చేరుకున్నాయి. నేడు మంచు ఫ్యామిలీలో చోటు చేసుకున్న వివాదాలను పరిష్కరించడం కోసం చర్చలు జరుగుతున్నాయి . దీంతో జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.ఇక ఇదే సమయంలో తనకు తన కుమారుడైన మంచు మనోజ్ తో ప్రాణహాని ఉందని, తనకూ తన ఆస్తులకు రక్షణ లేదని మోహన్ బాబు కూడా లేఖ ద్వారా రాచకొండ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్ పైన ఆయన భార్య మౌనిక పైన పోలీసులు కేసు నమోదు చేశారు.మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్ పైన 329 (4) 351 (2)3(5) బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. అలాగే మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో కూడా మరో ఎఫ్ఐఆర్ ను పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ రెండు ఎఫ్ఐఆర్ లలో ఉన్న సంచలన అంశాల విషయానికి వస్తే మనోజ్ ఎఫ్ఐఆర్లో విజయ్ రెడ్డి, కిరణ్ తో పాటు మరికొంతమందిని నిందితులుగా చేర్చారు.ఇక మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులో గత ఆదివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో పది మంది వ్యక్తులు తనపై బెదిరింపులకు దిగారని, తన ఇంట్లోకి ప్రవేశించి తనని ఇంట్లో ఉండవద్దని బెదిరించారని పేర్కొన్నారు. తాను షూటింగ్ కి వెళ్లి ఉంటానని భావించి ఇంట్లోకి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మనోజ్ భార్యను, పిల్లలను చంపేస్తామని బెదిరించారని ఆయన ఫిర్యాదు చేసినట్టు ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు.మనోజ్ భార్య పిల్లలను ఇక్కడ ఎందుకు ఉన్నారంటూ బెదిరించి పరుగులు పెట్టించిన మోహన్ బాబుకు చెందిన వ్యక్తులు వారిని పట్టుకునే క్రమంలో గొడవ జరిగిందని, ఈ సమయంలోనే మనోజ్ కు గాయాలు అయ్యాయని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. మనోజ్ ఆసుపత్రికి వెళ్లిన తర్వాత సిసి ఫుటేజ్ కూడా మాయం చేశారన్నారు.విజయ్,కిరణ్ లు సీసీటీవీ ఫుటేజ్ మాయం చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇక జరిగిన సంఘటనపై మీడియాలో ప్రసారం చేయవద్దని మీడియా ప్రతినిధులపై కూడా విజయ్ బెదిరింపులకు దిగారని మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్ పైన ఆయన భార్య పైన కేసు నమోదు చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.