జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి రద్దు చేసిన ప్రత్యేక హోదాను తిరిగి పునరుద్ధరించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అమిత్ షాను ఒమర్ అబ్దుల్లా బుధవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాను పునరుద్ధరించడంతో పాటు కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఇటీవల జరిగిన జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అత్యధిక సీట్లను గెలుచుకుని, కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా మరోమారు గత వారం బాధ్యతలు స్వీకరించారు. సీఎం హోదాలో ఆయన బుధవారం ఢిల్లీకి వచ్చి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు దాదాపు అర గంట సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రికి పరిస్థితిని వివరించారని, రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశంపై కూడా చర్చించారని అధికారులు తెలిపారు. మూడు రోజుల క్రితం గందర్‌బల్ జిల్లాలోని గంగంగిర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఒక వైద్యుడితో సహా ఏడుగురిని నిర్దాక్షిణ్యంగా హతమార్చిన ఉగ్రవాద దాడి తర్వాత అబ్దుల్లా పర్యటన జరిగింది.