ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ గురువారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ట్రిబ్యునల్ చైర్మన్, జస్టిస్ మొహమ్మద్ గోలమ్ మోర్తుజా మజుందార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వారెంట్ జారీ చేసినట్లు చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం పేర్కొన్నారు. హసీనా, అవామీ లీగ్ అగ్ర నేతలు సహా 45 మందికి అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సిందిగా ట్రిబ్యునల్‌లో రెండు పిటిషన్‌లు దాఖలైనట్లు తెలిపారు. హసీనా సహా 45 మందిని నవంబర్ 18లోగా అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపరచాలని సంబంధిత అధికారులను ధర్మాసనం ఆదేశించింది.హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల విద్యార్థులు భారీ నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలో పలువురు మరణించారు. ఈ హత్యలకు పాల్పడిన వారిపై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్‌లో విచారణ చేపడతామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.