టి.నరసాపురం:స్థానిక విజన్ యు.పి స్కూల్ నందు మంగళవారం నాడు భారత 11వ రాష్ట్రపతి,భారతరత్న, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా పద్మభూషణ్ పద్మవిభూషణ్ డాక్టర్ ఏ.పి.జె.అబ్దుల్ కలాం 93వ జయంతి వేడుకలు ( ప్రపంచ విద్యార్థుల దినోత్సవ వేడుకలు)పాఠశాల ప్రధానోపాధ్యాయులు పురం. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎంత ఎత్తుకు ఎదిగినా తమ ప్రజలను, తమ దేశాన్ని మర్చిపోకుండా మాతృభూమి అభివృద్ధి కోసం పాటుపడిన మహనీయులలో కలాం ముఖ్యులు. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో చేరి అగ్ని, పృథ్వి, ఆకాష్, త్రిశూల్, నాగ్ వంటి రాకెట్ల రూపకల్పనలో ముఖ్యపాత్ర వహించారు. దేశ రక్షణ వెన్నెముకగా నిలిచి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు గడించారు. విద్యార్థుల పట్ల ఆయనకు ఉన్న ప్రేమకు చిహ్నంగా ఆయన పుట్టిన రోజును ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. కలలు కనండి వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించండి అని చెప్పిన గొప్ప వ్యక్తి కలాం . మే నెల 26వ తేదీన కలాం స్విట్జర్లాండ్ దేశాన్ని పర్యటించిన కారణంగా ఆ దేశ ప్రజలు ఆ రోజును ఆ దేశపు జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. సాధించాలనే ఆశయం దృఢంగా ఉంటే ఏదీ అసాధ్యం కాదన్న కలాం స్పూర్తితో ముందుకు సాగడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి. ఆయనను నేటి యువత, విద్యార్థుల అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు మహనీయడు అబ్దుల్ కలాం అనే అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేయబడ్డాయి.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినిలు విజయలక్ష్మి, సులోచన, వరలక్ష్మి, ప్రియాంక, జ్యోతి, అనూష, ప్రశాంతి, రమ్యశ్రీ, నక్షత్ర, సుమలత, మధులత మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.