ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద సహాయక చర్యలపై జరిగిన అవాస్తవ ప్రచారాన్ని గట్టిగా ఖండించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో, వరదలతో ప్రభావిత ప్రాంతాల్లో సాయం అందించే క్రమంలో, ముఖ్యంగా 28వ వార్డులో, నీళ్లు చేరకపోయినా అక్కడి ప్రజలకు 25 కేజీల బియ్యం ప్యాకేజీని అందించినట్టు పేర్కొన్నారు. ఇది మానవతా దృక్పథంతో చేసిన చర్య అని చెప్పారు.అయితే, ఈ విషయంపై కొన్ని మీడియా వర్గాలు తప్పుడు ప్రచారం చేశాయని, అవాస్తవాలు రాసారని ఆయన మండిపడ్డారు. ప్రజలకు సాయం అందించడంలో, విరాళాలను పారదర్శకంగా వినియోగించడంలో తమకున్న నిబద్ధతను వివరించారు. తనపై ఉన్న విశ్వాసంతో దాతలు 400 కోట్ల రూపాయల విరాళం అందించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో తాను ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానని చెప్పారు.దాతల స్ఫూర్తికి విఘాతం కలిగించకుండా, అవినీతి మరియు అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా అలా చేస్తే, తప్పు సరిదిద్దుకుని, ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని చంద్రబాబు హెచ్చరించారు.