Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుతిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం మంచిది కాదు

తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం మంచిది కాదు

సీఎం స్థాయిలో చంద్రబాబు మాటలు బాధ కలిగించాయని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. దేవుడిని కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలను బాబు భయబ్రాంతులకు గురిచేశారని విమర్శలు గుప్పించారు. ప్రతి 6 నెలలకోసారి టెండర్ల ద్వారా నెయ్యి సేకరణ జరుగుతుందని, ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని పరిశీలించిన తర్వాతే వినియోగిస్తారని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం గడికోట మాట్లాడుతూ.. కేవలం రాజకీయం కోసమే చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారని అన్నారు. శ్రీవారిని అడ్డం పెట్టుకొని పొలిటికల్‌ గేమ్స్‌ ఆడుతున్నారని దుయ్యబట్టారు. జులైలో వచ్చిన రిపోర్ట్‌ను సెప్టెంబర్‌లో బయటపెట్టారని, తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం మంచిది కాదని తెలుసుకోవాలని హితవు పలికారు.‘నెయ్యి ట్యాంకర్లను మూడు దశల్లో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత కూడా లడ్డూ తయారీకి ఎలా పంపించారు?. ఒక కేజీ నెయ్యి తయారు చేయాలంటే 40 లీటర్ల పాలు అవసరం. ప్రతిరోజూ ఇలాంటి నెయ్యి 30 లీటర్లను అభిషేకం చేస్తారు. ఈ పద్ధతిలో 50 టన్నుల నెయ్యి తయారు చేయలేము. నైవేద్యం తయారీకి పవిత్రమైన నెయ్యిని వాడతారు. అభిషేకానికి, నైవేద్యానికి, దీపాలకు పవిత్రమైన నెయ్యిని ఉపయోగిస్తారు. వెన్నతో నవనీత సేవ కోసం కొండపైనే అవులను పెంచి వెన్నను తయారు చేస్తున్నారు. జూన్‌లో వచ్చిన నెయ్యి ని వెనక్కి పంపించకుండా అదే నెయ్యితో లడ్డూ ఎలా తయారు చేయించారు ?తప్పు చంద్రబాబు చేశారు.. డ్రామాలు ఎన్ని రోజులు చేస్తారు?. సెంటిమెంట్ క్రియేట్ చేసి తిరుమలను కలుషితం చేసే కుట్రలు చేస్తున్నారు. ప్రత్యర్థులపై చంద్రబాబు నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. మహానేత వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి.. వేద పాఠశాలను ప్రారంభించారు. 2014 – 2019 వరకు దేవాలయాలకు ఎన్ని నిధులు కేటాయించారు? 2019 – 2024 వరకు ఎన్ని నిధులు మంజూరు చేశారు ?. స్టీల్ ప్లాంట్, వరద నష్టం, మెడికల్ కాలేజీ, వంద రోజుల పాలన అంశాలను దృష్టి మళ్లించడానికి.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నార‌ని శ్రీ‌కాంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు.నింద వేయడమే మా విధానం అన్నట్లుగా ఉంది చంద్రబాబు తీరు. వైయ‌స్ఆర్‌సీపీని భుజాన వేసుకొని మాట్లాడటానికి రాలేదు. శ్రీవారి భక్తుడిగా మాట్లాడుతున్నా. చిత్తశుద్ధి లోపించినప్పుడు ఇలాంటి పనులు చేస్తారు. సెంటిమెంట్‌కు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి. తాపత్రయ పడి తిరుమలను రోడ్డున పడేయకండి. అందరూ బాధ్యతగా వ్యవహరించాలి. తిరుమలలో ఏ తప్పూ జరగలేదు. జరిగిన ప్రచారానికి ఇకనైనా ఫుల్‌స్టాఫ్ పెట్టాలి. వాస్తవాలను వక్రీకరించకుండా నిజాలని ప్రజలకు తెలియజేసే విధంగా విచారణ జరపాలి. రాజకీయ కోణంలో చూడొద్దు. తిరుమలలో పూజ విధానం జియ్యర్ల ద్వారానే జరుగుతోంది’ అని గడికోట శ్రీకాంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article