గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థినుల హాస్టల్‌లో రహస్య కెమెరాల అంశంపై మొదట ఆందోళన మొదలైంది. విద్యార్థినులు హాస్టల్ వాష్ రూంలో రహస్యంగా కెమెరాలు ఉన్నాయనే ఆరోపణలతో ఆందోళన బాట పట్టారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. సదరు నిందితుడిని అదుపులోకి తీసుకొని, అతని ల్యాప్‌టాప్ మరియు సెల్‌ఫోన్‌లను సీజ్ చేసి, సైబర్ నిపుణులతో పరిశీలన జరిపారు.విశ్లేషణలో వాష్ రూంలలో ఎటువంటి కెమెరా లింకులు లేదా వీడియోలు లేవని నిర్ధారణ అయ్యింది. కృష్ణా జిల్లా ఎస్సీ గంగాధరరావు ఈ విషయంపై ప్రకటన విడుదల చేశారు. విద్యార్థినులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే, ఈ వార్తను ట్రోలింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంపై సీరియస్‌గా స్పందించారు. హాస్టల్‌లో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని, జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ లను ఘటనా స్థలానికి పంపాలని ఆదేశించారు.