మనసున్న మహను భావులకు సర్వమతాలు ఒక్కటే
- నిరూపించుకున్న వైద్యుడు జమాల్ ఖాన్
చింతూరు :మనసున్న మహను భావులకు సర్వమతాలు ఒక్కటే అని, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ నిరూపించుకున్నారు. త్వరలో వినాయక విగ్రహాల ప్రతిష్టలు, మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఎర్రంపేట గ్రామానికి చెందిన యువకులు సాయి, సాయిబాబు లు వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని, ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ ను సంప్రదించారు. ఉత్సవాలకు గాను తమవంతు సహాయాన్ని అందించాలని వారు కోరారు. నిర్వాహకుల కోరిక మేరకు, వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమానికి తన వంతుగా, ఖాన్ పది బియ్యం బ్యాగులను అందించి, వినాయకుని పై తనకున్న భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఖాన్ మాట్లాడారు. హిందూ ముస్లిం లందరూ సోదర భావంతో మెలగాలన్నారు. మనందరి దైవం ఒకటేనని, కులాలు వేరైనా, మతాలు వేరైనా, మన అందరి లక్ష్యం ఒకటేనన్న సత్యాన్ని గ్రహించాలన్నారు. అదే ముక్తి మార్గమన్నారు. దేవుడు ఎక్కడో ఉండడని, మనం చేసే మంచి పనుల్లోనే ఉంటాడని ఖాన్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెకెసిటీ ట్రస్ట్ సభ్యులు వహీదుల్లా ఖాన్, సద్దాం, అమాన్ తదితరులు పాల్గొన్నారు.