ఫాంహౌస్ ఆరోపణలపై పట్నం మహేందర్ రెడ్డి
ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తన ఫాంహౌస్‌పై వస్తున్న ఆరోపణలకు సంబంధించి తాజా ప్రెస్ మీట్‌లో స్పందించారు. కొత్వాల్ గూడలోని సర్వే నెం.13లో 14.14 ఎకరాల భూమి తన కుమారుడి పేరుతో ఉన్నట్లు తెలిపారు. ఈ భూమిని 1999లో కొనుగోలు చేసినట్టు, 2005లో నిబంధనల మేరకు చిన్న కట్టడం నిర్మించినట్టు చెప్పారు.ఆ భూమి, నిర్మాణం ఏమైనా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే, తానే స్వయంగా కూల్చేస్తానని చెప్పారు. ఆయన తన కుటుంబం వ్యవసాయ నేపథ్యానికి సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ, ఇంత చిన్న భూమిని కబ్జా చేయాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.పట్నం మహేందర్ రెడ్డి, అక్రమ నిర్మాణ ఆరోపణలను ఖండిస్తూ, అది చిన్న గెస్ట్ హౌస్ అని, ఎఫ్ టీఎల్ లేదా బఫర్ జోన్ పరిధిలో నిర్మించినట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. పక్కన పలు ఫంక్షన్ హాళ్లు, ఇతర నిర్మాణాలు కూడా ఉన్నాయని తెలిపారు.అలాగే, మహేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఆక్రమణ నివారణ చర్యలను, ప్రత్యేకంగా హైడ్రా ఏర్పాటును ప్రశంసించారు. చెరువులు, కుంటలను పునరుద్ధరించడంలో ప్రతీ ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.