కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారం కేసులో పరిణామాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. తాజాగా వైరల్ అయిన వీడియో ఈ కేసులో మరిన్ని అనుమానాలు, ప్రశ్నలకు దారితీస్తోంది. ఈ వీడియోలో డాక్టర్ దేబాశిష్ సోమ్, పోలీసులు, ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ లాయర్ శంతను డే, ఇతర ఆసుపత్రి సిబ్బంది సెమినార్ హాల్‌లో చర్చిస్తున్నట్లు కనిపించారు. ఈ సందర్భంలో, బాధిత వైద్యురాలి మృతదేహం ఈ వీడియోలో కనిపించలేదు.ఈ వీడియో పై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి, ముఖ్యంగా ఆధారాలు చెరిపివేయడానికి ఈ సమావేశం జరిగిందా అన్నది. వైరల్ అవుతున్న ఈ వీడియోపై డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఇందిరా ముఖర్జీ మాట్లాడుతూ, సెమినార్ హాల్ నిషేధిత ప్రాంతం కాదని, పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు మాత్రమే లోపలికి వెళ్లారని, కానీ లాయర్ అక్కడ ఎందుకు ఉన్నాడన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.మాజీ పోలీసు అధికారి పంకజ్ దత్తా మాట్లాడుతూ, వీడియోలో కనిపిస్తున్న వారిని విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి రావొచ్చని అభిప్రాయపడ్డారు. దీనితో, నిందితుడు సంజయ్ రాయ్ చేసిన ప్రకటన నిజమని అనుమానాలు పెరుగుతున్నాయి.