మాజీ నటుడు, రాజకీయ నాయకుడు బాబుమోహన్ తిరిగి తన సొంత గూటి అయిన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. బాబుమోహన్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, అలాగే బాబుమోహన్ తిరిగి టీడీపీలో చేరడం పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.బాబుమోహన్ 1999లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, సాంఘిక సంక్షేమ మంత్రిగా పనిచేశారు. తరువాత, టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) లో చేరి 2004 మరియు 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే, 2018లో టీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరి, 2018 మరియు 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తరువాత బాబుమోహన్ బీజేపీకి గుడ్‌బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరారు.ఇప్పటివరకు, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుకాగానే, తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయాలనే చంద్రబాబు సంకల్పించారు. ఈ క్రమంలోనే బాబుమోహన్ వంటి నాయకుల చేరికకు చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి.ఇదిలా ఉంటే, టీడీపీలోకి తిరిగి చేరేందుకు మరికొంతమంది నాయకులు ముందుకొస్తున్నట్లు ఊహాగానాలు జరుగుతున్నాయి.

