- డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి
వేంపల్లె :భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గొప్ప దార్శనికుడని, ఆయన జీవితం స్పూర్తిదాయకమని మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 73,74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారన్నారు. స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారత కోసం కృషి చేశారన్నారు. ఎలక్ట్రానిక్, సమాచార విప్లవాన్ని శ్రీకారం చుట్టారని, ప్రతి ఇంట్లో టీవీ, ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్ లు ఉన్నాయంటే రాజీవ్ గాంధీ కృషినే అన్నారు. ఓటు వయోపరిమితిని 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ధృవకుమార్ రెడ్డి, సుబ్రమణ్యం, రామకృష్ణ, అమర్, ఉత్తన్న, బాబు, సుబ్బరాయుడు, రాజా, వేమయ్య, వెంకటేష్, మదార్ తదితరులు పాల్గొన్నారు.

