ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయిన వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఎన్నికల ముందు నుంచే సీట్లు రాక నిరాశలో ఉన్న కొందరు పార్టీ మారి.. పోటీ చేసి మరీ గెలిచారు. ఎన్నికల తర్వాత వైసీపీ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఒక్కొక్క నేత పార్టీని వీడుతుండటంతో.. వైసీపీ కి దెబ్బ మీద దెబ్బ పడుతోంది.తాజాగా ఆ పార్టీలో కీలక నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వారంరోజుల క్రితమే ఆయన పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలకు రాజీనామా చేసినట్లు తెలిపారు. తాజాగా.. వ్యక్తిగత కారణాలతో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆళ్ల నాని వెల్లడించారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెన్నంటే ఉన్న ఆళ్లనాని.. ఆయన మరణం తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన చెప్పిందే వేదం. పార్టీలో అంతర్గత కలహాలను తీర్చి.. పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. పలుమార్లు ఎమ్మెల్యేగా, వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా, 2019 ఎన్నికల తర్వాత వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.ఆళ్లనాని కూడా వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో.. ఏలూరులో వైసీపీ మొత్తం ఖాళీ అయిపోయింది.

