జమ్మూ కశ్మీర్ లోని దోడా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో, భద్రతా బలగాలు ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఒక ఆర్మీ కెప్టెన్ మరణించారు. ఈ ఘటనలో మరో సాధారణ పౌరుడు గాయపడ్డాడు.ఉగ్రవాదుల కదలికల గురించి మంగళవారం సాయంత్రం సమాచారం అందడంతో, సైనిక బలగాలు శివగఢ్-అసర్ బెల్ట్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు, ఫలితంగా ఎదురుకాల్పులు మంగళవారం రాత్రి మొదలై బుధవారం ఉదయం వరకు కొనసాగాయి.ఈ ఎన్‌కౌంటర్‌లో, ఉగ్రవాదుల స్థావరం గుర్తించబడింది, కానీ టెర్రరిస్టులు అప్పటికే అక్కడి నుంచి పారిపోయారు. ఈ స్థావరం నుంచి పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సైనిక అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాలలో అమెరికాలో తయారైన ఎం4 అసాల్ట్ రైఫిల్ కూడా ఉంది.ప్రస్తుతం దోడా జిల్లాలో కార్డన్ సెర్చ్ కొనసాగుతోందని, పారిపోయిన టెర్రరిస్టులను పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

