నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ విషాద ఘటన తీవ్ర ఆవేదనను కలిగిస్తోంది. సోమవారం రాత్రి కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రదీప్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ప్రదీప్ తన సోదరుడికి మెసేజ్ పెట్టి, ఎంబీబీఎస్ విద్యార్థి రాహుల్ తనను కొన్నేళ్లుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని, రాహుల్ వేధింపులు తట్టుకోలేక తనకు ఇదే చివరి నిర్ణయమని తెలిపాడు.కుమారుడు మరణానికి కారణమైన రాహుల్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రదీప్ కుటుంబ సభ్యులు ఆసుపత్రి మార్చురీ ముందు ఆందోళన చేపట్టారు. కాలేజీ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రదీప్ మృతదేహాన్ని పరిశీలించి, పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటన విద్యార్థులు, కాలేజీ సిబ్బంది మధ్య దుమారం రేపింది. బాధితుడి కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది, రాహుల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

