ప్రధాని మోదీకి ‘థ్యాంక్స్’ చెప్పిన రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్రమోదీ వయనాడ్ జిల్లాలో ఇటీవల జరిగిన కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించడం పట్ల లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన స్పందనను తెలియజేశారు. వయనాడ్ పరిస్థితిని సమీక్షించడం పట్ల ప్రధానికి రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా చూడడం ద్వారా దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.రాహుల్ గాంధీ తన ఎక్స్ వేదికలో పోస్ట్ చేస్తూ, “భయంకర విషాదాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి వయనాడ్‌ను సందర్శిస్తున్నందుకు మోదీకి ధన్యవాదాలు. ఇది మంచి నిర్ణయం. ప్రధాని ఈ భయంకర విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూశాక దానిని జాతీయ విపత్తుగా ప్రకటిస్తారని విశ్వసిస్తున్నాను” అని పేర్కొన్నారు.ప్రధాని నరేంద్రమోదీ శనివారం కేరళలోని వయనాడ్ జిల్లాను సందర్శించి, అక్కడి బాధితులను పరామర్శించారు. ఇప్పటికే ప్రధాని మోదీ కన్నూర్ విమానాశ్రయంలో దిగారు. ఆయన హెలికాప్టర్‌లో కొండచరియలు విరిగిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.

