ఎస్సీ వర్గీకరణను దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నలుగురు ముఖ్యమంత్రులు స్వాగతించారని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగానే స్పందించి వర్గీకరణను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ సాధనలో ప్రధాని నరేంద్ర మోదీ మరియు అమిత్ షా పాత్ర ఎంతో ఉందని, వారికి కృతజ్ఞతలు తెలిపారు.వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలని, ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణను అమలు చేయాలని మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. వర్గీకరణపై ప్రధాని మోదీ నిర్దిష్టంగా హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రాలు కూడా వెంటనే అమలు చేసేలా ప్రధాని మోదీ సూచించాలని కోరారు.వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ప్రతి జడ్జికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా చాలా పేదకుటుంబాలకు రిజర్వేషన్ ఫలాలు అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణకు మద్దతు తెలిపిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

