Tuesday, November 18, 2025

Creating liberating content

తాజా వార్తలుయువతోవ.. సమాజసేవ

యువతోవ.. సమాజసేవ

14 ఏళ్ళుగా వివేకానంద ఫౌండేషన్ సేవలు

12 వ తేదీ అంతర్జాతీయ యువజన దినోత్సవం

పోరుమామిళ్ల:సాయం ఎంత చిన్నదైనా చేస్తే వ్యక్తిని భగవంతుడి ప్రతిరూపం గా నిలుపుతుంది. చేయూత పొందిన వ్యక్తి మదిలో కలకాలం ఉండేలా చేస్తుంది. ఇక అనాధలు అభాగ్యులకు నా అన్న లేని వారిని ఆదరిస్తే ఆ సేవ దైవానికి చేరుతుంది. మానవత్వం పరిమళించేలా చేస్తుంది. పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఎలాంటి స్వలాభాన్ని ఆశించకుండా జీవించేవాళ్లు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. నేటి సమాజంలో అలాంటి వాళ్ళ అవసరం ఎంతైనా ఉంది. అలాంటి వాళ్ళను మనం వేళ్ళతో మాత్రమే లెక్కపెట్టగలం. పుట్టి విద్యాబుద్ధులు గడిచి నేనెవరు నేనేమిటి అన్న ఆలోచన చేస్తే స్పందన ఉన్నప్పుడు సహజంగా వచ్చే ఆలోచన ఈ సమాజానికి ఏదైనా చేయాలని. అదొక సంకల్పం అయినప్పుడు ఇక తిరుగు ఉండదు. జీవితపు చివరి దశంలో సమాజం గురించి ఆలోచించే బదులు జీవితాన్ని మొదలు పెడుతున్న రోజుల్లోనే ఆ సామాజిక తత్వాన్ని కలిగి దాన్ని సహకారం చేసుకోవడానికి ఆ బాటలోనే నడుస్తూ అందులోనూ ఆ రోజుల్లో ఒక 20 ఏళ్ల ఒక యువకుడు స్వామి వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని, శ్వాసగా మార్చుకొని నిత్యం సమాజం కోసం పరితపిస్తున్న ఆ యువకుడే పాపిజెన్ని రామకృష్ణారెడ్డి. కడప జిల్లా కలసపాడు మండలం తెల్లపాడు గ్రామంలో రెండు ఎకరాల భూమి ఉన్న రెండు పూటలా తినడానికి కూడా నోచుకోని ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. రామకృష్ణారెడ్డి ఇంటర్ చదువుతున్నప్పుడు స్వామి వివేకానంద బోధనలకు ప్రభావితుడై 2010 జనవరి 12 వ తేదీన తన స్నేహితులతో కలిసి వివేకానంద ఫౌండేషన్ సంస్థను స్థాపించాడు. తన లాంటి భావజాలాన్ని కలిగిన 40 మంది సభ్యులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. వారు చేస్తున్న సేవల గురించి అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం.

అనాథలకు చేయూత :

రోడ్ల పక్కన, వీధుల్లో, బస్టాండ్ లో తిరుగుతూ ఉండే ఎందరో అభాగ్యులను, అనాథలను మనలో మామూలుగా ఎవరైనా చూచిన వారి దగ్గర నుండి వచ్చే దుర్గందాన్ని భరించలేరు. వారి యొక్క అవతారాలు చూసి ఛీత్కరించేవారే ఎక్కువ. ఎవరైనా దయతలిచ్చి పదో పరకో ఇచ్చేవారు తప్ప వారికి అంతకుమించి సహాయం చేయలేరు. ఆదరించలేరు. అటువంటి వారిని చేరదీసి, క్షవరం చేసి, స్నానం చేసి శుభ్రమైన బట్టలు తొడిగి వారికి ఆత్మీయ బంధువులుగా చేయూతనిస్తున్నారు. పురుగులు పట్టి కంపుకొట్టే వారిని సైతం ఆదరిస్తూ మీకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు వివేకానంద ఫౌండేషన్ సభ్యులు. చలికాలం రాగానే రోడ్లపై బస్టాండ్లో ఉండే నిరాశ్రయులకు వందలాదిమందికి దుప్పట్లు అందిస్తూ చలి బారి నుండి రక్షిస్తున్నారు. పూటగడవని నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందిస్తూ, అవసరార్థులకు అవసరమైన సహాయాలు వంటివి చేస్తున్నారు.

అంతిమ సంస్కారాలు :

పుట్టుక అందరికి ఒకేలాగా ఉన్న మరణము అందరికీ ఒకేలాగ ఉండదు. రోడ్లపై ఎందరో అభాగ్యులు మరణిస్తే వారికి అన్నీ తామై అనాధగా ఎవరు మరణించకూడదంటూ సంప్రదాయ పద్ధతుల్లో అంతిమ సంస్కారాలు చేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో అంత్యక్రియలు చేయడం వివేకానంద ఫౌండేషన్ సభ్యులకు సేవానిరతికి నిదర్శనం. ఇప్పటివరకు 70 మంది అనాథలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

విద్యార్థులకు బాసట :

వెలుగు పంచినప్పుడే విలువ దీపానికైనా వ్యక్తి జీవితానికైనా. నిరుపేద విద్యార్థులకు తమ వంతు సాయం అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశయంతో బాసట అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాల ప్రారంభ సమయంలో వారికి అవసరమైన బ్యాగులు, నోటు పుస్తకాలు, స్టేషనరీ వస్తువులు వంటి విద్యాసామాగ్రిని ఇప్పటివరకు దాదాపుగా 3,000 మంది విద్యార్థులకు ఉచితంగా అందించారు. 10వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి తర్వాత గల విద్య ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించి, పబ్లిక్ పరీక్షలు రాసేందుకు అవసరమైన పరీక్ష సామాగ్రిని, కెరీర్ గైడెన్స్ పుస్తకాలను ఇప్పటివరకు కొన్ని వేల మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థులలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వివిధ విభాగాలలో పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేయడం, చదువుకోవాలన్న ప్రతిభ నుండి ఆర్థిక పరిస్థితులు అడ్డుమారిన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయటము, నిఘంటువులు, ప్లేట్లు గ్లాసులు, క్రీడావస్తులు తదితర వంటివి విద్యార్థుల భవిష్యత్తు కోసం అందిస్తూ వారికి బాసటగా నిలుస్తున్నారు.

సాహిత్య సేవ :

నీ వెనకవేముంది నీ ముందే ముందే అనేది కాదు నీలో ఏముంది అనేది స్వామి వివేకానందుని పలుకులకు కార్యరూపం దాలుస్తూ విజ్ఞాన సేవ అనే కార్యక్రమం ద్వారా గ్రామాలలో గ్రంథాల ఏర్పాటు చేయటం, వివేకానందుడి సాహిత్యం ఉచితంగా అందచేయటం, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని ఆశయంతో విజ్ఞాన దీపిక పుస్తకాన్ని ,‌‌ అబ్దుల్ కలాం గారి జీవితాన్ని యువతకు తెలియజేయుటకు కలాం – సలాం అనే పుస్తకాన్ని సమాజంలో సేవాతత్పరతను పెంపొందించుటకు సేవాంజలి అనే పుస్తకాలను ప్రచురించి 2500 మందికి పంపిణీ చేశారు. అంతేకాకుండా విద్యార్థుల్లో , యువతలో సంస్థలోని పెద్దల సహకారంతో మానవతా విలువలను పెంపొందించేలా వ్యక్తిత్వ వికాస చైతన్య సదస్సులను కూడా నిర్వహిస్తున్నారు.

ఎన్నో సేవలు :

రక్తదానం చేయడం, మొక్కలు నాటడం, యస్.టి. కాలనీలోని పేదలకు నిత్యావసర సరుకులు, బట్టలు వంటి అందించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నవారిని సేవా పురస్కారాలతో గౌరవిస్తున్నారు. వివేకానంద ఫౌండేషన్ చేసే సేవలకు గుర్తింపుగా దాదాపు 70 పైగా అవార్డులు వరించాయి.

అనాథల కోసం సేవాశ్రమం ఏర్పాటు:

రోడ్ పై ఒక అభాగ్యుడు కాలు గాయమై దుర్వాసనతో పురుగులు పట్టి నరకయాతన అనుభవించేది గమనించాడు రామకృష్ణారెడ్డి. ఆ వ్యక్తికి అన్ని సపర్యలు చేసిన బ్రతకలించలేకపోయాడు. రామకృష్ణారెడ్డి ఆ క్షణమే అలాంటి అభాగ్యులకు మంచి జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకొని ఆశ్రమాన్ని నిర్మించాలనుకున్నాడు. దానికి తోడు వివేకానంద ఫౌండేషన్ సంస్థలోని పెద్దలు, ఆత్మీయులు అండదండలతో పాటు వివేకానందుడ ఆశీస్సులు తోడయ్యాయి. ఫలితంగా కడప జిల్లా కాశినాయన మండలంలోని ఓబులాపురం గ్రామ సమీపంలో సగిలేరు నది ఒడ్డున ఒక ఎకరా స్థలంలో వివేకానంద సేవాశ్రమాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఇప్పటి వరకు ఈ సేవాశ్రమంలో దాదాపు 70 మంది అనాథలు ఆశ్రయం పొందారు. అందరూ ఉండి ఆశ్రయం కోరి వస్తే అక్కున్న చేర్చుకున్నప్పటికీ వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి 35 మందిని తమ కుటుంబాలకు అప్పజెప్పి మానవత్వాన్ని పెంపొందిస్తున్నారు. ఎవరూ లేని 25 మంది ఆశ్రమం లోనే మరణిస్తే సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. గాయాలతో బాధపడేవారు, దివ్యాంగులైనారు ఆనందంగా ఆశ్రమం లో గడుపుతున్నారు. ఆశ్రమంలోని సేదతీరే అభాగ్యులకు చివరి దశలో సంతోషంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వినోదాలకు, విలాసాలకు అలవాటు పడుతున్న నేటి యువతరానికి వివేకానంద ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు చేస్తున్న సేవలు వయసులో ఆదర్శప్రాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article