Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుసీఎం జగన్ సారథ్యంలో మోడల్ స్టేట్ గా ఏపీ

సీఎం జగన్ సారథ్యంలో మోడల్ స్టేట్ గా ఏపీ

రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

ప్రజాభూమి విజయవాడ బ్యూరో:
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏపీ ఒక మోడల్ స్టేట్ గా మారిందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58 వ డివిజన్ 240 వ వార్డు సచివాలయ పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. భరతమాత కాలనీలో విస్తృతంగా పర్యటించి 132 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు స్థానికుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఈ ప్రాంత ప్రజలకు చేయగలిగినంత మంచి చేశామని మల్లాది విష్ణు తెలిపారు. గత నాలుగున్నరేళ్లలో సచివాలయ పరిధిలో రూ. 6.06 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు. వీటిలో రూ. 5.17 కోట్ల నిధులతో తమ్మిన దుర్గారావు నగర్, గ్రీన్ స్ట్రీట్ ఏరియా, షణ్ముఖ సాయి నగర్, సన్ సిటీ కాలనీ మెయిన్ రోడ్డు, న్యూ.ఆర్.ఆర్.పేట వెళ్లు ప్రధాన రహదారి, భరతమాత మందిరం మెయిన్ రోడ్డు సహా 5.50 కి.మీ. మేర 36 రహదారులను నిర్మించుకున్నట్లు వివరించారు. అలాగే 6.50 కి.మీ. మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, త్రాగునీటీ లైన్లను వేసినట్లు చెప్పారు. భరతమాత కాలనీలోనూ యూజీడీ, వాటర్ లైన్ల పనులు ఇప్పటికే పూర్తికాగా.. ప్రతి ఇంటికీ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ప్రతిపక్షాలకు ఎందుకంత అక్కసు..?

రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టిని ఆకర్షించేలా సుపరిపాలన అందిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. అది చూసి ఓర్వలేక టీడీపీ, బీజేపీ, జనసేన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. చివరకు ఏపీలో ఒక్క ఓటు, సీటు లేని సీపీఐ నాయకులు కూడా మాపై విమర్శలు చేస్తున్నారని.. ముఖ్యమంత్రి గూర్చి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడిపిస్తున్నట్లు పురంధేశ్వరి గారు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేటాయించే నిధులు కాకుండా.. విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయించిన నిధులేమైనా ఉంటే సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు ఫిషింగ్ హార్బర్ ప్రమాదాన్ని జనసేన అధినేత రాజకీయం చేయడం సిగ్గుచేటని మల్లాది విష్ణు అన్నారు. ఎక్కడ, ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఆపాదించడం సరికాదని.. ప్రమాదం జరిగిన మూడు రోజుల్లోనే మత్స్యకారులకు అండగా నిలబడి, దాదాపు రూ.7.5 కోట్లు సాయం అందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. 49 మంది పడవల యజమానులు, వాటిపై ఆధారపడిన మరో 450 మందికి కూడా ఆర్థిక సాయం చేస్తే.. దానిని కూడా రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. అదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హుదూద్, తిత్లీ తుఫానుల్లో నష్టపోయిన బోటు యజమానులను కనీసం ఆదుకున్న పాపాన పోలేదన్నారు. ఇప్పటికే తెలంగాణ ఎన్నికలలో టీడీపీ, జనసేన చేతులెత్తేశాయని రానున్న ఎన్నికల్లో ఏపీలోనూ ఇరు పార్టీలు భూస్థాపితం కావడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, వరప్రసాద్, సతీష్, వెంకట్, తోట వెంకటేశ్వరరావు, అంజిరెడ్డి, తోపుల వరలక్ష్మి, శోభన్, మహేశ్వరి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article