పుణ్యక్షేత్రాలకు కూరగాయల వితరణ
ప్రజాభూమి, నూజివీడు :
నూజివీడు పట్టణ పరిసర ప్రాంతాల నుండి వివిధ పుణ్యక్షేత్రాలలో నిర్వహించే భక్తుల అన్నదానం కార్యక్రమానికి రైతులు దాతల సహకారంతో కూరగాయలను శనివారం వితరణగా అందించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆదర్శ రైతు నక్క సత్యనారాయణ మాట్లాడుతూ నూజివీడు పరిసర ప్రాంతాలలోని రైతులు, దాతల సహకారంతో భక్తుల అన్నదానం కార్యక్రమానికి కూరగాయలను వితరణగా అందిస్తున్నట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి 12 టన్నులు, ద్వారకాతిరుమల దేవస్థానానికి నాలుగు టన్నులు కూరగాయలను తొమ్మిదవ సారిగా పంపుతున్నట్లు చెప్పారు. మొట్టమొదటిసారి శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆలయానికి నాలుగు టన్నులు, విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయానికి నాలుగు టన్నులు భక్తుల అన్నదానానికి శ్రేష్టమైన కూరగాయాలను నియమి నిష్ఠలతో భక్తులైన రైతులు ఎవరికి వారే కోసి అందించినట్లు చెప్పారు. మొత్తం గా నేడు 24 టన్నులు కూరగాయలను భక్తుల అన్నదానానికి వితరణగా అందిస్తున్నామని, సహకరించిన ప్రతి ఒక్కరికి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగ దేవి, శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబా దేవి, విజయవాడలో వేంచేసియున్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ తల్లి, మల్లికార్జున స్వామి, ద్వారకా తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి, అమ్మవార్ల దీవెనలు అందించాలని ఆకాంక్షించారు. ఇదే రీతిలో ప్రతినెల కూరగాయలను అందించనున్నట్లు తమ లక్ష్యంగా పేర్కొన్నారు. ఇందుకోసం ఆయా దేవస్థానాలు ప్రత్యేక వాహనాలను నూజివీడు పట్టణానికి పంపుతున్నట్లు వివరించారు. ఇలా పంపిన ప్రత్యేక వాహనాలలోనే కూరగాయలను ప్యాకింగ్ చేసి సరఫరా చేస్తున్నట్లుగా తెలిపారు.