-పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయండి -పోలీస్ శాఖ అధికారులను ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ఉభయసభల సమావేశాలు మొదలవనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఉన్నతాధికారులుతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఐదురోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మొదటిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండనుంది. అనంతరం ప్రశ్నోత్తరాలు, శ్వేత పత్రాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు.
ఈనెల 22వ తేదీ నుండి జరగనున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సమావేశాలు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కె.మోషేన్ రాజు,శాసన సభాపతి సిహెచ్.అయ్యన్నపాత్రుడు పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు.రానున్న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా చేపట్టాల్సిన బందోబస్ధు ఏర్పాట్లపై వారు శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలో పోలీస్ శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. ఈసందర్భంగా రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషన్ రాజు మాట్లాడుతూ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు 88 మంది కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు మరియు కొంతమంది శాసన మండలి సభ్యులు హాజరు కానున్ననేపధ్యంలో ఆయా సభ్యులను సక్రమంగా గుర్తించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.అసెంబ్లీ ప్రాంగణం అత్యంత ముఖ్యమైన సెక్యురుటీ జోన్ అని కావున ఎవరు బడితే వారు లోనికి ప్రవేశించకుండా,ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగని రీతిలో కట్టు దిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.ముఖ్యంగా అసెంబ్లీ ప్రాంగణంలోని అన్ని సిసి కెమోరాలు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సెక్యురిటీ,ఇతర బందోబస్తు నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి పోలీసు అధికారులు,సిబ్బందిని నియమించడం జరుగుతుందని కావున వారికి సకాలంలో తాగునీరు,ఆహారం వంటి కనీస సౌకర్యాలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు.వచ్చే అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేందుకు వీలుగా విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేయాలని శాసన మండలి అధ్యక్షులు కె.మోషేన్ రాజు పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రశాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఈనెల 22నుండి అసెంబ్లీ సమావేశాలు సుమారు 5రోజుల పాటు జరిగే అవకాశం ఉందని కావున సమావేశాలు ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు వీలుగా విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.గతంలో అసెంబ్లీ సమావేశాల సమయంలో గ్యాలరీల్లో ప్లేకార్డులతో కొంతమంది ప్రవేశించిన సంఘటనలు చూశామని అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.అసెంబ్లీ గ్యాలరీల్లోకి ప్రవేశించే వారిని పూర్తిగా తనిఖీ చేశాకే అనుమతించాలని స్పష్టం చేశారు.అంతేగాక గుర్తింపు కార్డు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోనికి అనుమతించాలని అన్నారు.ఈసారి అసెంబ్లీ సమావేశాలకు 88 మంది కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు,9మంది శాసన మండలి సభ్యులు రానున్నారని కావున వారిని గుర్తించేందుకు అసెంబ్లీ సిబ్బందని ప్రవేశ ద్వారాల వద్ద ప్రత్యేకంగా నియమించాలని శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు ఆదేశించారు.అసెంబ్లీ ప్రాంగణంలోని అన్ని సిసి కెమెరాలు సక్రమంగా పనిచేసే విధంగా చూడాలని చెప్పారు. బందోబస్తు నిర్వహించే పోలీస్ సిబ్బందికి,మీడియాకు తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.భద్రత విషయంలో ఎంతమాత్రం రాజీ పడవద్దని పోలీస్ శాఖ అధికారులను శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. ఈసమావేశంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర,శాంతి భద్రతల ఐజి శ్రీకాంత్,గుంటూర్ రేంజ్ ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి,గుంటూర్ ఎస్పి సతీష్ కుమార్,ఎస్పిఎఫ్ ఎస్పి యం.శంకర్ రావు,గుంటూరు అదనపు ఎస్పి శ్రీనివాసరావు,విజయవాడ డిసిపి చక్రవర్తి, సచివాలయ చీఫ్ సెక్యురిటీ అధికారి కె.కృష్ణమూర్తి,భద్రయ్య తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.