- క్రిమినల్స్ ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదు
- శిక్షలు వెంటనే అమలు జరిపేలా చట్టాలు, ప్రత్యేక కోర్టులు
- నంద్యాల, విజయనగరం జిల్లాల అత్యాచార బాధితులకు ఆర్ధిక సహాయం మంజూరు.
హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత
అమరావతి:రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు, గంజాయి, చీప్ లిక్కర్ అరికట్టే ఆంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్షించారని, సమీక్షలో ముఖ్యమంత్రి చర్చించిన అంశాలను విలేకరులకు హోం శాఖ మంత్రి వివరించారు.నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక ఘటనపై ఇప్పటికే ముగ్గురు మైనర్లు అరెస్ట్ అయ్యారని, రోజుకో మాట మార్చడంతో బాలిక మృతదేహం ఆచూకీ కూడా ఇంకా లభించలేదు, ఎన్.డి.ఆర్.ఎఫ్ బలగాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని, గంజాయి, మద్యం మత్తులో అత్యాచారాలు చేసే నిందితులు ఎటువంటి వారైనా వదిలే ప్రసక్తి లేదని, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి, నిందితులకు వెంటనే శిక్షలు కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవలసిందిగా సిఎం ఆదేశాలు జారీ చేశారని మంత్రి తెలిపారు. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో ఆరు నెలల పసికందుపై వరసకు తాతైన వ్యక్తి అత్యాచార యత్నం చేయడం ఇటువంటి వ్యక్తిని సంఘంలో చూడడం దురదృష్టకర పరిణామమని, సంఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని, కేవలం మద్యం మత్తులో ఈ సంఘటన జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని అన్నారు. గంజాయి, నకిలీ మద్యానికి బానిసలై వావివరసలు మరచిపోతున్నారని, పోర్న్ సైట్లు కూడా మైనర్లను చెడుదోవ పట్టిస్తున్నాయని, సెల్ ఫోన్లు పిల్లలకు ఇచ్చేముందు తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టాలని, పాఠశాలల్లో విద్యార్ధులకు వాటిపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.గంజాయి, నకిలీ మద్యానికి బానిసైన వారికి డి ఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, ఆడపిల్లలపై అత్యాచారం చేయాలనే ఆలోచన వచ్చిందంటే భయపడేలా శిక్షలు అమలు జరిపేందుకు చట్టాలు రూపొందిస్తామని హోం మంత్రి అన్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి అత్యాచార బాధితురాలి కుటుంబానికి పదిలక్షల రూపాయల ఆర్ధిక సహాయం, విజయనగరం జిల్లా అత్యాచార బాధిత పసికందుకు ఐదు లక్షల రూపాయలు ఫిక్సిడ్ డిపాజిట్ రూపంలో ఆర్ధిక సహయాన్ని ముఖ్యమంత్రి మంజూరు చేశారని, త్వరలోనే ఆ పరిహారాన్ని ఆ కుటుంబాలకు స్వయంగా అందజేస్తానని హోం శాఖ మంత్రి తెలియజేశారు.