ఓ న్యూస్ ఛానెల్ అతని అడ్డా
నగరంలోని ప్రముఖులు పేర్లు చెప్పి మట్టి మాఫియాలో రారాజుగా ఎదిగిన డాన్
పోలవరం కాలువ పనులలో మట్టి మాఫియా డాన్ గా అవతారం
ఒక సామాన్య వ్యక్తి ఒక మీడియా సంస్థ పేరు చెప్పి కోట్లు ఏలా సంపాదించాడు
ప్రజాభూమి, విజయవాడ బ్యూరో
కొత్తూరు తాడేపల్లి గ్రావెల్ క్వారీ లకు అనుమతులు ఎలా వచ్చాయి.. ఎవరు ఇచ్చారు.. అటవీశాఖనా లేక రెవిన్యూ శాఖనా అనే నిజం ఆ షాడో రాజకీయ నాయకులకే తెలియాలి. ఒక సాదాసీదా జీవితం గడిపే కొందరు స్థానిక వ్యక్తులు ఈ రోజు కోట్లు ఎలా కూడబెట్టారు అనే విషయం అధికారులే నిగ్గు తేల్చాలి. రోజుకు వందల లారీలు జాతీయ రహదారి పై పరుగులు పెడుతుంటే అధికారులకు కనపడటం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొత్తూరు తాడేపల్లి లో మట్టి మాఫియాకు ఇప్పుడు బంగారం పండిస్తుంది. రోజుకు లక్షలు తెచ్చిపెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇంత భారీ ఎత్తున ఎర్ర బంగారం (గ్రావెల్ )రవాణా జరుగుతుంటే అధికారులకు తెలియకుండా ఉందా అనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎక్కడో అరా కొర మట్టి రవాణా జరిగింది అంటే గుట్టు చప్పుడు కాకుండా జరిపారు అనుకోవచ్చు. కానీ ఇంత బహిరంగంగా వందల లారీలు పట్టపగలు ప్రభుత్వం సొమ్ము దోపిడీకి గురవుతుంటే అధికారులు ఏమి పట్టనట్టు వ్యవహారిస్తున్న తీరు ప్రభుత్వ వ్యవస్థలకే అవమానాలు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, మైనింగ్, రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ ఖజానా దోపిడీకి కాకుండా కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విషయమై అధికారులను వివరణ అడగగా వారు స్పందించిన తీరు ఈ విధంగా ఉంది.
జిల్లా అటవీ శాఖ అధికారి:అప్పన్న
మాకు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు మా దృష్టికి మీడియా ముఖంగా అందిన సమాచారం మేరకు మా అధికారులతో విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ గ్రావెల్ మాఫియాకు అధికారులు ఎవరైనా సహకరించినట్టు విచారణలో వెళ్ళడైతే వారిపైన కూడా శాఖా పరమైన చర్యలు తప్పవు అని తెలియజేసారు.
రూరల్ మండల రెవిన్యూ అధికారి:లక్ష్మి
మాకు ఈవిషయమై చాలా ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా స్థాయి అధికారులకు ఈమేరకు రిపోర్ట్ ఇచ్చామన్నారు. గ్రావెల్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులను ఇప్పటికే గుర్తించామని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ మేర త్రవ్వకాలు జరిపారో గుర్తించి కేసులు నమోదు చేయడానికి కూడా తాము వెనుకాడమని అని మీడియా ముఖంగా తెలియజేసారు.