Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుయాంటీబ‌యోటిక్స్ విచ్చ‌ల‌విడి వినియోగంతో పెను విప‌త్తు

యాంటీబ‌యోటిక్స్ విచ్చ‌ల‌విడి వినియోగంతో పెను విప‌త్తు

అవ‌గాహ‌న పెంచుకొని.. ఔష‌ధాల‌ను తెలివిగా ఉప‌యోగించుకోవాలి

  • ప్ర‌పంచ యాంటీ మైక్రోబియ‌ల్ రెసిస్టెన్స్ అవ‌గాహ‌న వారోత్స‌వాల్లో క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

వివిధ వ్యాధికార‌క సూక్ష్మ‌జీవుల‌ను సంహ‌రించే యాంటీబ‌యోటిక్స్ ఔష‌ధాలను అవ‌గాహ‌న లేకుండా విచ్చ‌ల‌విడిగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల కలిగే అన‌ర్ధాలు పెను విప‌త్తుకు దారితీస్తాయ‌ని.. అందువ‌ల్ల అవ‌స‌రం మేర‌కు వైద్యుల సూచ‌న‌లకు అనుగుణంగా మాత్రమే యాంటీబ‌యోటిక్స్‌ను ఉప‌యోగించుకోవాల‌ని ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు.
న‌వంబ‌ర్ 18-24 వ‌ర‌కు ప్ర‌పంచ యాంటీ మైక్రోబియ‌ల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్‌) అవ‌గాహ‌న వారోత్స‌వాల సంద‌ర్భంగా శుక్ర‌వారం స్థానిక పాత స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రిలో క‌లెక్ట‌ర్ డిల్లీరావు.. వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారుల‌తో క‌లిసి ప్ర‌త్యేక అవ‌గాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ బ్యాక్టీరియా, వైర‌స్‌, శిలీంధ్రాలు వంటి వ్యాధికార‌క సూక్ష్మ‌జీవుల‌పై పోరాడే యాంటీబ‌యోటిక్స్ మందుల ఆవిష్క‌ర‌ణ వెనుక శాస్త్ర‌వేత్త‌ల కృషి ఎంతో ఉంటుంద‌ని.. అలాంటి మందుల‌ను వినియోగించ‌డంలో చేసే త‌ప్పులే కాల‌క్ర‌మంలో వాటి సామ‌ర్థ్యాన్ని త‌గ్గించేస్తున్నాయ‌ని వివ‌రించారు. ప‌ది సంవ‌త్స‌రాల కింద‌ట క‌నుగొన్న ఔష‌ధం ఇప్పుడు స‌రిగా ప‌నిచేయ‌డం లేదంటే అందుకు కార‌ణం వాటిని తెలివిగా ఉప‌యోగించులేక‌పోవ‌డ‌మేన‌ని పేర్కొన్నారు. వివిధ వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్ల నుంచి మ‌నుషులు, జంతువులు, మొక్క‌ల‌ను కాపాడే మందులను విచ‌క్ష‌ణా ర‌హితంగా వాడి దుర్వినియోగం చేయ‌డం వ‌ల్ల ఆ మందుల‌కు సూక్ష్మ‌క్రిములు లొంగ‌కుండా మొండికేసే నిరోధ‌క సామ‌ర్థ్యాన్ని పెంచుకుంటాయ‌ని.. ఇలాంటి అన‌ర్ధాల‌పై ప్ర‌జ‌ల‌కు విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించే ల‌క్ష్యంతో ఏటా ప్ర‌పంచ యాంటీ మైక్రోబియ‌ల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్‌) అవ‌గాహ‌న వారోత్స‌వాలను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. యాంటీబ‌యోటిక్స్ బాధ్య‌తాయుత వినియోగంపై ప్ర‌జ‌ల‌ను జాగృతం చేయ‌డంతో పాటు కొత్త చికిత్సా విధానాలు, ఔష‌ధాల‌పై ప‌రిశోధ‌న‌ల‌ను ప్రోత్స‌హించ‌డం వంటివి కూడా ఈ కార్య‌క్ర‌మం ముఖ్య ఉద్దేశాల‌ని పేర్కొన్నారు. వైద్యుల‌ను సంప్ర‌దించ‌కుండా, మందుల చీటీ లేకుండా మందులు వాడొద్ద‌ని.. వైద్యులు సూచించిన మోతాదు ప్ర‌కార‌మే ఔష‌ధాలు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు సూచించారు. కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా వైద్య‌, ఆరోగ్య శాఖ సిబ్బంది, న‌ర్సింగ్ విద్యార్థులు.. చేతులను శుభ్రంగా ఉంచుకోండి.. వ్యాధికార‌క క్రిముల‌కు అడ్డుక‌ట్ట వేయండి;
భ‌ద్ర‌తే నీ జీవితానికి నేస్తం.. అది లేకుంటే జీవితం అస్త‌వ్య‌స్తం; మితిమీరి మందులు వాడొద్దు.. ఆరోగ్యాన్ని నాశ‌నం చేసుకోవ‌ద్దు.. అంటూ ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌భుత్వ న‌ర్సింగ్ క‌ళాశాల విద్యార్థులు చేతుల ప‌రిశుభ్ర‌త‌, ఆరోగ్య‌క‌ర అల‌వాట్ల‌పై పాడిన పాట‌లు, చేసిన నృత్యాలు అల‌రించాయి. ఈ విద్యార్థుల‌ను క‌లెక్ట‌ర్ డిల్లీరావు ప్ర‌త్యేకంగా అభినందించారు.
కార్య‌క్ర‌మంలో డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డా. డి.వెంక‌టేష్‌, డీసీహెచ్ఎస్ డా. బీసీకే నాయ‌క్‌, స్టేట్ నోడ‌ల్ ఆఫీస‌ర్ డా. మోహ‌న్‌కృష్ణ‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. ఇందుమ‌తి, వైద్య ఆరోగ్య అధికారులు డా. అమృత‌, డా. న‌వీన్‌, డా. మాధ‌వి, డా. మోతీబాబు, డా. స‌మీర‌, క్వాలిటీ కంట్రోల్ ప్రతినిధి షీబా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article