Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుపిల్ల‌ల్ని చ‌దివించి, వివాహాన్ని గౌర‌వ‌ప్ర‌దంగా జ‌రిపేందుకేవైఎస్సార్ క‌ళ్యాణ‌మ‌స్తు, షాదీ తోఫా*

పిల్ల‌ల్ని చ‌దివించి, వివాహాన్ని గౌర‌వ‌ప్ర‌దంగా జ‌రిపేందుకేవైఎస్సార్ క‌ళ్యాణ‌మ‌స్తు, షాదీ తోఫా*

పేద‌ల జీవ‌న ప్ర‌మాణాల‌ను మెరుగుప‌రిచేందుకు, ఆర్థిక అస‌మాన‌త‌లు తొల‌గించే ల‌క్ష్యంతో దేశంలో ఎక్క‌డాలేని విధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు అమ‌లుచేస్తోందని.. పేద త‌ల్లితండ్రులు త‌మ పిల్ల‌ల‌ను బాగా చ‌దివించి.. ఆపై వారి వివాహాన్ని గౌర‌వప్ర‌దంగా జ‌రిపించే ల‌క్ష్యంతోనే వైఎస్సార్ క‌ళ్యాణ‌మ‌స్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టి, అమ‌లుచేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు.
వైఎస్ఆర్ క‌ళ్యాణ‌మ‌స్తు, వైఎస్సార్ షాదీ తోఫా ప‌థ‌కాల కింద 2023, జులై-సెప్టెంబ‌ర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటల‌కు ఆర్థిక స‌హాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ‌చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి వ‌ర్చువ‌ల్‌గా క‌లెక్ట‌రేట్ వీడియో కాన్ఫ‌రెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఎస్‌.డిల్లీరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, ల‌బ్ధిదారుల‌తో కలిసి హాజ‌ర‌య్యారు. అనంతరం 4వ విడ‌త‌లో 372 మంది ల‌బ్ధిదారుల‌కు సంబంధించిన రూ. 3.25 కోట్ల మెగా చెక్‌ను ల‌బ్ధిదారుల‌కు అంద‌జేసి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ గ్రామ‌, వార్డు స‌చివాలయాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, విభిన్న ప్ర‌తిభావంతులు, భ‌వ‌న నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడ‌పిల్ల‌ల‌కు వైఎస్సార్ క‌ళ్యాణ‌మ‌స్తు ద్వారా, ముస్లిం మైనార్టీ వ‌ర్గాల ఆడ‌పిల్ల‌ల‌కు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్థిక స‌హాయం అందిస్తోంద‌న్నారు. బాల్య వివాహాల‌ను నివారించ‌డం, పిల్ల‌లు పెద్ద చ‌దువులు చ‌దివేలా ప్రోత్స‌హించే ల‌క్ష్యంతో ఈ ప‌థ‌కాల‌కు అర్హ‌త‌ల‌ను నిర్దేశించిన‌ట్లు వివ‌రించారు. ఒక మ‌హిళ జీవితంలో వివాహం అనేది ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం. ఈ కార్య‌క్ర‌మాన్ని పేద త‌ల్లిదండ్రులు గౌర‌వ‌ప్ర‌దంగా జ‌రపాల‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం ఆర్థిక స‌హ‌కారం అందిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ఏడాది నాలుగో విడ‌త‌లో 372 మంది వ‌ధూవ‌రుల‌కు ల‌బ్ధి చేకూర్చ‌డం జ‌రిగింద‌ని.. వీరిలో బీసీల‌కు చెందిన‌వారు 157 మంది, ఓసీల‌కు చెందిన‌వారు న‌లుగురు, ఎస్సీల‌కు చెందిన వారు 181 మంది, ఎస్‌టీల‌కు చెందిన‌వారు 30 మంది ఉన్న‌ట్లు వివ‌రించారు. విద్యద్వారా జీవితాల‌ను ఉన్న‌త స్థితికి చేర్చ‌వ‌చ్చ‌నే ఉద్దేశంతో విద్యారంగానికి రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌మిస్తూ జ‌గ‌న‌న్న అమ్మ ఒడి, జ‌గ‌న‌న్న విద్యా కానుక‌, జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌, జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన వంటి విప్ల‌వాత్మ‌క ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తోంద‌ని.. వీటిని స‌ద్వినియోగం చేసుకొని భ‌విష్య‌త్తు కెరీర్ ప‌రంగా ఉన్న‌త స్థానాల‌కు ఎద‌గాల‌ని సూచించారు.
కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ ప‌శ్చిమ శాస‌న‌స‌భ్యులు వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు, తిరువూరు శాస‌న‌స‌భ్యులు కొక్కిలిగ‌డ్డ ర‌క్ష‌ణ‌నిధిలు ల‌బ్ధిదారుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్థిక అస‌మాన‌తలు రూపుమాపేందుకు, స‌మాజంలో గౌర‌వంగా జీవించేందుకు వివిధ ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తోంద‌ని.. వీటిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ద్వారా ల‌బ్ధిదారుల‌ను ఎంపిక‌చేసి.. వైఎస్సార్ క‌ళ్యాణ‌మ‌స్తు, షాదీ తోఫా ప‌థ‌కాల ద్వారా మూడు నెల‌ల‌కు ఒక‌సారి ఆర్థిక స‌హాయం అందిస్తున్‌నట్లు వివ‌రించారు.
జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం.విజ‌య‌భార‌తి మాట్లాడుతూ వైఎస్ఆర్ క‌ళ్యాణ‌మ‌స్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ప‌థ‌కాల‌కు అర్హ‌త సాధించాలంటే వ‌ధూవ‌రులిద్ద‌రూ ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో పాటు పెళ్లి నాటికి అమ్మాయి వ‌య‌సు 18 ఏళ్లు, అబ్బాయి వ‌య‌సు 21 ఏళ్లు దాటి ఉండాల‌నే నిబంధ‌న ఉంద‌న్నారు. దీనివ‌ల్ల బాల్య వివాహాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డంతో పాటు పైచ‌దువులు దిశ‌గా అడుగులు వేయించేందుకు వీలుంటుంద‌ని విజ‌య‌భార‌తి సూచించారు.
కార్య‌క్ర‌మంలో విశ్వ‌బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ తోలేటి శ్రీకాంత్‌, ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ బండి శివ‌శ‌క్తి పుణ్య‌శీల‌, స్టేట్ మైనారిటీస్ ఫైనాన్ష్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ షేక్ ఆసిఫ్‌, ఏపీ పౌర స‌ర‌ఫ‌రాల డైరెక్ట‌ర్ శేఖ‌ర్‌రెడ్డి, జిల్లా గ్రంథాల‌య సంస్థ ఛైర్‌ప‌ర్స‌న్ టి.జ‌మ‌ల పూర్ణ‌మ్మ‌, డిప్యూటీ మేయ‌ర్ బెల్లం దుర్గ‌, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాస‌రావు, గిరిజ‌న సంక్షేమ అధికారి ఎం.రుక్మాంగ‌ద‌య్య‌, ల‌బ్ధిదారులు, అధికారులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article