హిందూపురం టౌన్ :బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు పోరాటాలు సాగించిన రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతిసాహు మహారాజ్ అని వక్తలు పేర్కొన్నారు. బుధవారం హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం శాఖ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సాహు మహారాజ్ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరాములు మాట్లాడుతూ, భారతదేశంలో మొట్టమొదట రిజర్వేషన్ల పితామహుడు సాహు మహారాజ్ అన్నారు. కొల్లాపూర్ సంస్థానంలో బహుజనులైన ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టి బహుజనుల ఎదుగుగదలకు తొలిసారిగా బాటలు వేసిన బహుజన రాజ్యాధికార పితామహుడు సాహూ మహారాజ్ అని, ఆయన ఆశయాలు, ఆలోచనలను బాబాసాహెబ్ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని, వాటిని కార్యరూపం దాల్చడానికి కాన్షిరాం ఎనలేని కృషి చేశారన్నారు. సాహు మహారాజ్ ఆశయాలకు అనుగుణంగా బహుజన సమాజ్ పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని ప్రశంసించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు కాన్షీరాం ఆశయ సాధన కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి నాయకులు హరికుమార్, చౌళూరు రామాంజనేయులు, సుబ్బరాయప్ప, సత్యానందమూర్తి, సడ్లపల్లి నారాయణప్ప, శ్రీ రంగరాజు పల్లి శ్రీనివాసులు, చిరంజీవి, ఖలందర్ తదితరులు పాల్గొన్నారు.

