తాజా వార్తలుహాస్టల్ వర్కర్ల శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వేతనాలు పెంచాలి
హాస్టల్ వర్కర్ల శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వేతనాలు పెంచాలి
- సిఐటియు జిల్లా కార్యాదర్శి పల్లపు వెంకట్
చింతూరు :గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న కార్మికుల శ్రమను ప్రభుత్వం గుర్తించి, వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా కార్యాదర్శి పల్లపు వెంకట్ డిమాండ్ చేశారు.
బుధవారం చింతూరులో సిఐటియు ఆధ్వర్యంలో హాస్టల్ వర్కర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పల్లపు వెంకట్ మాట్లాడారు. గత వైసిపి ప్రభుత్వం హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న కార్మికుల శ్రమను దోచుకుందని ఆరోపించారు. హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది, రోజుకి 14 గంటలు పని చేస్తున్నారని, వారి శ్రమను దారపోసి విద్యార్థులకు మంచి ఆహారం అందిస్తున్నారన్నారు. అర కొర వేతనాలతో తమ రెక్కల కష్టాన్ని హాస్టళ్లకు దారపోసిన కార్మికులను 60.ఏళ్లు దాటగానే వారిని రిటైర్మెంట్ చేస్తున్నారని, రిటైర్మెంట్ తర్వాత శ్రమ చేసే శక్తి లేక, ఆదాయ మార్గం లేక వారు ఆర్థిక ఇబ్బందులతో దుర్భర జీవనం వెళ్ళ దేస్తున్నారని వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 30.ఏళ్లుగా హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులను పాలక ప్రభుత్వాలు క్రమ బద్దీకరించకపోవటం బాధాకరం అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం, హాస్టళ్ల అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలను 26.వేలకు పెంచి, వారికి ఉద్యోగ భద్రత కల్పింస్తు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు. అదే విధంగా సీనియార్టీ ప్రకారం వర్కర్ల క్రమ బద్దీకరణ చేపట్టాలన్నారు. పిఎఫ్, ఇఎస్ఐ, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, సంవత్సరానికి రెండు జతల యూనిఫార్మ్ ఇవ్వాలన్నారు. విద్యార్థుల సంఖ్య కనుగుణంగా వర్కర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు పోరాటానికి సిద్ధంగా కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు, హాస్టళ్ల వర్కర్లు దుర్గారావు,చంద్రమ్మ,పుల్లమ్మ,తిరుపతమ్మ,వీరయ్య,నాగేశ్వరరావు,రమాదేవి,చెల్లెమ్మ, రోజమణి,రాంబాబు, వీరాస్వామి,శాంతమ్మ,రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.