ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు కావడంపై తొలిసారిగా మాజీ మంత్రి రోజా స్పందించారు. ఎన్నికల ఫలితాల అనంతరం స్తబ్దతగా ఉన్న మాజీ మంత్రి రోజా తొలిసారిగా వైసీపీ అద్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సంధర్భంగా తాజా రాజకీయ స్థితిగతులు, ఓటమికి గల కారణాలను రోజా వివరించారు. అలాగే పలువురు వైసిపి నాయకులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.అనంతరం ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ.. ఇలాంటి ఓటమి రోజు ఒకటి ఉంటుందని, తాము అస్సలు ఊహించలేదన్నారు. కానీ తమకు 40 శాతం ప్రజలు ఓటు వేశారన్నారు. 40 శాతం ఓట్లు వచ్చిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారని, అలాగే 40 శాతం ఓట్లు వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ సిఎం అయ్యారన్నారు. కానీ ఏపీలో 40 శాతం ఓట్లు వచ్చిన తాము ఎలా ఓటమి చెందామన్నది అంతుబట్టడం లేదన్నారు. అలాగే కేవలం 10 శాతం ఓట్లు కూటమికి వచ్చాయని, ఇప్పటికైనా సిఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చేలా పాలన సాగించాలని కోరారు.రుషికొండ ప్యాలెస్ పై రోజా స్పందిస్తూ.. టీడీపి తన పరిపాలనలో ఎప్పుడూ ఒక భవనాన్ని నిర్మించిన దాఖలాలు లేవని, వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ భవన నిర్మాణంను టిడిపి ఓర్వలేక పోయిందన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని టిడిపి విమర్శలు చేయాలన్నారు. అలాగే ఆడుదాం ఆంధ్రలో అవినీతి జరిగిందని ఆరోపణ చేయడం తగదని, అసలు ఆడుదాం ఆంధ్రకు మంజూరైన నిధులే రూ.100 కోట్లు కాగా, రూ. 100 కోట్లు స్కామ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అద్భుతమైన భవనాన్ని రుషికొండ లో నిర్మించడం తనకు గర్వంగా ఉందన్నారు.

