చంద్రబాబు వల్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనే విషయాన్ని మోదీ గుర్తించాలి
-చంద్రబాబు ప్రత్యేక హోదా సహా విభజన హామీలను అమలయ్యేలా చూడాలి
-జగన్‌కు వ్యతిరేకంగా వెళదామనే నినాదంతో
ఓట్లు పడ్డాయి
-వైఎస్ విగ్రహాలపై దాడులను ఖండించిన షర్మిల
-వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్పారు… ఇక నేనేం చెప్పాలి
-హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే పోటీ చేశా
-కడపలో తన ఓటమికి ‘టైమ్’ కారణమన్న షర్మిల
-తాను కడపలో మొత్తం తిరగలేకపోయానని వ్యాఖ్య
-కడపలో ప్రజలను భయబ్రాంతులకు
గురి చేశారని ఆరోపణ
-హంతకుల పాపం పండేరోజు వస్తుంది : వైఎస్ షర్మిల
విజయవాడ:-
పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందేనని వైసీపీ గురించి షర్మిల నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు నిర్వహించిన తర్వాత విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఈ సారి ఊహించని ఫలితాలు వచ్చాయని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఓకే నిర్ణయం మీద ఆధారపడి జరిగిన ఎన్నికలన్నారు. జగన్ మీద ఉన్న వ్యతిరేకత ఆధారంగా జరిగిన ఎన్నికలని విశ్లేషించారు. ఈ సారి ప్రజలు తమ ఓటు కి న్యాయం జరగాలి అనుకున్నారని.. ప్రజలు మార్పు కోరుకున్నారని స్పష్టం చేశారు. ప్రజల గట్టి నిర్ణయం తీసుకున్నారు కాబట్టే ఈ సారి కాంగ్రెస్ కూడా మంచి ఫలితాలు తీసుకు రాలేక పోయిందన్నారు. ఎన్నికలకు ముందు 8 శాతం ఓటు బ్యాంక్ వస్తుంది అనుకున్నామని.. 64 నియోజక వర్గంలో నేను సభల్లో పాల్గొన్నానన్నారు. అయితే ప్రజలు ఒక్క ఓటు కూడా వృధా కావొద్దనుకున్నారని.. అందుకే జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. పిల్ల కాలువలు అన్ని సముద్రంలో కలవాల్సిందేనని.. కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రమని షర్మిల వ్యాఖ్యానించారు. వైసిపి నుంచి ఎంత మంది వచ్చినా స్వాగతిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. ఏ నిర్ణయం తీసుకున్నా కమిటీ ఉంటుంది..పద్ధతి ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారమే సీట్ల పంపిణీ జరిగిందన్నారు. తనపై సుంకర పద్మశ్రీ చేసిన చిల్లర ఆరోపణలు నేను పట్టించుకోలేదని.. వాళ్ళ మీద పార్టీ తరుపున కఠిన చర్యలు తీసుకుంటాని ప్రకటించారు.
ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వచ్చాయని.. రాహుల్ పాదయాత్ర న్యాయం కోసం,ఐక్యత కోసం చేసిన పోరాటం ఫలిచిందన్నారు. ఎంతోమంది గుండెల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరిగిందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ కష్టం వల్ల ఎంతో లాభం కలిగిందన్నారు. ప్రతి కార్యకర్త ను గర్వగంగా నిలబెట్టాడని.. రాహుల్ కి మనస్ఫూర్తిగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నామన్నారు. బీజేపీ రాహుల్ దెబ్బకు చితికల పడిందని.. ఇండియా బ్లాక్ మంచి ఫలితాలను చూపిందన్నారు. కొద్దిగా ఇండియా బ్లాక్ కష్టపడి ఉంటే రాహుల్ ప్రధాని అయ్యే వారని జోస్యం చెప్పారు.
కడపలో తన ఓటమికి ప్రధాన కారణం ‘టైమ్’ అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బుధవారం ఆమె పత్రికా సమావేశంలో మాట్లాడుతూ… తాను కడపలో కేవలం 14 రోజులు మాత్రమే తిరిగానన్నారు. మిగతా అన్ని రోజులూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించానని వెల్లడించారు. 14 రోజుల పాటు ఎంతో కష్టపడినా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను కవర్ చేయలేకపోయామన్నారు. అసలు తాను పోటీ చేస్తున్న విషయం చాలా గ్రామాల్లో తెలియదన్నారు.
కడపలో పరిస్థితులు అంతా వేరుగా ఉన్నాయన్నారు. కడపలో అప్పటికే వైసీపీ నుంచి ఎంపీ ఉన్నారని… ఎమ్మెల్యేలు ఉన్నారని… అప్పుడు వైసీపీయే అధికారంలో ఉందని గుర్తు చేశారు. దీంతో అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తెలిస్తే తమకు వచ్చే పథకాలు పోతాయని… కేసులు పెడతారని… దాడులు చేస్తారనే భయం ప్రజల్లో ఉందన్నారు. అదే సమయంలో ఓటుకు రూ.3,500 నుంచి ఆ పైన ఇచ్చారన్నారు. విచ్చలవిడిగా డబ్బులు పంచారన్నారు. డబ్బులు పని చేయని చోట బెదిరింపులకు పాల్పడ్డారన్నారు.హంతకులు మరోసారి చట్టసభలకు వెళ్లకూడదనే ఉద్దేశంతో మాత్రమే తాను పోటీ చేశానని షర్మిల తెలిపారు. తన లక్ష్యం నెరవేరకపోవచ్చు కానీ… ప్రజల కంటే పైన దేవుడు ఉన్నాడని… వారి పాపం పండుతుందన్నారు. వారి పాపం పండే రోజు కోసం దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడని తాను భావిస్తున్నానన్నారు.
ప్రజల తీర్పును గౌరవిస్తూ చంద్రబాబుకు మరోసారి కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూనే… ఆయనకు పలు విషయాలను గుర్తు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రజల ఊపిరి అన్నారు. హోదా విషయంలో బీజేపీ మనల్ని మోసం చేసిందని విమర్శించారు. 2015లో ఇచ్చిన హామీని ఈ రోజు వరకు నెరవేర్చలేదన్నారు. అయితే ఈరోజు చంద్రబాబు మద్దతు ఇస్తున్నందువల్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనే విషయాన్ని మోదీ గుర్తుంచుకోవాలన్నారు.
చంద్రబాబు మద్దతు ఇచ్చి ఉండకపోతే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండకపోయేదన్నారు. ఢిల్లీలో తాము పీఠం ఎక్కడానికి ఏపీ ప్రజలే కారణమని మోదీ గుర్తించాలన్నారు. తన వల్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనే విషయాన్ని చంద్రబాబు గుర్తించి… ప్రత్యేక హోదా సాధించుకు రావాలని డిమాండ్ చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. విభజన చట్టంలో పెట్టిన వాటిలో చాలా వాటిని సాధించుకోవాల్సి ఉందన్నారు. రాజధాని, పోర్టులు, కడపలో స్టీల్ ప్లాంట్… ఇలా ఎన్నింటినో చంద్రబాబు సాధించాల్సి ఉందన్నారు.
ఇక, ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని… వాటిని ఎలా అమలు చేస్తారో… ఎప్పుటి నుంచి ప్రారంభిస్తారో చెప్పాలన్నారు. చంద్రబాబు ఇప్పుడే గెలిచారని తమకు తెలుసునని… కానీ ఏపీ వెనుకబడిన రాష్ట్రం కాబట్టి వారు హనీమూన్ పీరియడ్ తీసుకునే పరిస్థితి కూడా లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు.
ఇటీవలి సార్వత్రిక, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జగన్‌కు వ్యతిరేకంగా అనే ఒకే నినాదంతో జరిగాయన్నారు. అందుకే ఎన్డీయే కూటమి విజయం సాధించిందన్నారు. ఓటు వృథా కావొద్దు… ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు కంకణం కట్టుకున్నందువల్లే కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఓట్లు సాధించలేదన్నారు. 2029 నాటికి తాము మంచి స్థాయికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అయినా వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని… ఇక తాను మాట్లాడాల్సింది ఏముంటుందన్నారు.
దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేసిన పాదయాత్ర కారణంగా కాంగ్రెస్ మంచి సీట్లు గెలుచుకుందన్నారు. బీజేపీ చేస్తోన్న అరాచకాలను ప్రజలు గుర్తించారని… అందుకే ఆ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సీట్లు రాలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ ఎన్నాళ్లు అధికారంలో ఉంటుందో చెప్పలేమన్నారు. ఈరోజు ఢిల్లీలో పవర్ బీజేపీ చేతిలో లేదన్నారు. బీజేపీ ఇతర పార్టీలపై ఆధారపడి ఉందన్నారు.
ఒక పార్టీ ఓడిపోయినందుకు వైఎస్ విగ్రహాలపై దాడులు దారుణమని షర్మిల అన్నారు. వైఎస్ మహానాయకుడని… ప్రజలకు ఎంతో సేవ చేసిన నాయకుడన్నారు. అలాంటి మహానాయకుడు చనిపోతే… అది తట్టుకోలేక 7 వేల మంది ప్రజలు చనిపోయారన్నారు.
అందుకే చనిపోయిన వారికి రాజకీయాలు ఆపాదించవద్దని కోరారు. ‘దయచేసి వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేయడం ఆపండి.. వారు చేశారని మీరు… మీరు చేశారని వాళ్లు.. ఇలా ఒకరి మీద ఒకరు చేసుకుంటూ వెళ్తే దీనికి అంతే ఉండదు. మళ్లీ చెబుతున్నాను… మీకు, ఇంకొకరికి తేడా ఉండాలంటే కొంచెం ఓపిక పట్టాలి’ అని సూచించారు.వైసీపీకి చెందిన చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి షర్మిల స్పందిస్తూ… ‘పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే… అది ఎండిపోతే తప్ప’ అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. జగన్ అయిదేళ్లు అధికారంలో ఉండి ప్రత్యేక హోదా తేలేకపోయారన్నారు.

