ఏపీ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు. ఫలితంగా కొన్ని ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు ఇంకా తాకలేదు. నిజానికి ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అంచనా కంటే 3 రోజులు ముందుగానే ఏపీలోకి ప్రవేశించాయి. ఈ నెల 2న రాష్ట్రాన్ని తాకినప్పటికీ ఆ తర్వాత వేగంగా విస్తరించడంలో మందగించాయి. ఉత్తరాంధ్రను నైరుతి మేఘాలు ఇంకా పలకరించలేదు. ఈ నెల 8న గోదావరి జిల్లాలను దాటిన నైరుతి మేఘాలు శుక్రవారం నాటికి కూడా ఉత్తరాంధ్రకు విస్తరించలేదు. మరో రెండు మూడు రోజుల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంపూర్ణంగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించనందున రాష్ట్రంలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో మినహాయించి వర్షాలు అంత పెద్ద ఆశాజనకంగా లేవని తెలుస్తోంది. కాగా మూడు రోజుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
రానున్న మూడు రోజుల్లో వర్షాలు..
అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అప్రమత్తం చేసింది. మరోవైపు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.